ప్రజాస్వామ్యంపై నీతుల కేజ్రీ.. 5 ఏళ్లలో అసెంబ్లీకి ఒక్క రోజేనా?
అయితే, కేజ్రీ ఐదేళ్లలో ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్లుగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది.
రొటీన్ రాజకీయ నాయకుల కంటే.. ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినవారు ప్రజాస్వామ్య విలువల పట్ల మరింత నిబద్ధతతో ఉంటారు. ఇలాంటివారు అధికారం చేపడితే బాధ్యతగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. ఈ కోవకు చెందినవారే ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అర్వింద్ కేజ్రీవాల్. అఖిల భారత సర్వీసు అధికారిగా ఉన్న కేజ్రీ.. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో వెలుగులోకి వచ్చారు. ఆపై ఆప్ ను స్థాపించి ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం రేపారు. పార్టీ ఆదర్శాలకు ఆకర్షితులైన ఢిల్లీ ప్రజలు రెండోసారీ గెలిపించారు. ఆప్ పంజాబ్ లోనూ అధికారం చేపట్టింది. జాతీయ పార్టీ స్థాయికి ఎదిగింది.
కాగా, ఢిల్లీలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. మద్యం విధానం కుంభకోణంలో గత ఏడాది జైలుకెళ్లిన కేజ్రీ.. విడుదల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంటే దాదాపు నాలుగేళ్లు పైన ఆయనే సీఎంగా ఉన్నారు. ఐదేళ్లు ఎమ్మెల్యే కూడా.
అయితే, కేజ్రీ ఐదేళ్లలో ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్లుగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది.
కేజ్రీనే కాదు ఆప్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాశ్ గెహ్లోత్, అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్, డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా సైతం ఒక్క రోజే ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లారట.
ఈ సమాచారం కూడా ఢిల్లీ శాసనసభ వెబ్‌సైటులో అందుబాటులో ఉన్నదేనట. ఢిల్లీ అసెంబ్లీ సెక్రటేరియేట్ నుంచి వచ్చిన సమాచార హక్కు చట్టం సమాధానాల ఆధారంగా ఏడీఆర్ నివేదిక రూపొందించింది.
ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో ఆప్ ప్రభుత్వం ఏర్పడింది. 2024 డిసెంబరు వరకు సగటున ఏటా 15 రోజులు సమావేశమైంది. మొత్తం 74 రోజులు సమావేశాలయి జరిగాయి.
కేజ్రీ కంటే అతిశీ బెటర్..
గత ఏడాది కేజ్రీ రాజీనామాతో ఢిల్లీ సీఎం అయ్యారు అతిశీ. ఈమె 31 రోజులు శాసనసభ సమావేశాలకు హాజరయ్యారని ఏడీఆర్ తెలిపింది.
సరిగ్గా ఎన్నికల ముంగిట కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ ఏడీఆర్ నివేదిక రావడం వెనుక ప్రత్యర్థుల కుట్ర ఉందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తనపై వచ్చిన ఈ కథనం పట్ల కేజ్రీ లేదా ఆప్ వర్గాలు స్పందిస్తే అసలు విషయాలు తెలిసే చాన్సుంది.