బాబా సిద్ధిఖీ హత్య కేసు... డ్రోన్ సాయంతో పాక్ నుంచి తుపాకులు!

ఈ క్రమంలో... బాబా సిద్ధీఖీ హత్య కేసులోనూ పాకిస్థాన్ పాత్ర ఉందనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

Update: 2024-10-26 03:55 GMT

భారతదేశంలో ఏ ఘోరం జరిగినా, ఏ దారుణం తెరపైకి వచ్చినా అందులో ఏదో ఒక రూపంలో, ఎంతో కొంత పాత్రైనా పాకిస్థాన్ ది ఉంటుందని అంటుంటారు. భారత్ కీడు కోరుకునే విషయంలో ఆ దేశం ముందుంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో... బాబా సిద్ధీఖీ హత్య కేసులోనూ పాకిస్థాన్ పాత్ర ఉందనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

అవును... ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ.. బాంద్రా ఈస్ట్ లోని నిర్మల నగర్ లో ఉన్న అతని కుమారుడు, ఎమ్మెల్యే జిషన్ సిద్ధిఖ్ ఆఫీసు సమీపంలో అక్టోబర్ 12న తుపాకీతో కాల్చబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ముంబై మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పుడు ఈ కేసులో పాక్ పాత్ర హాట్ టాపిక్ గా మారింది.

బాబా సిద్ధీఖీ హత్యకు మూడు తుపాకులు ఉపయోగించినట్లు ప్రథమికంగా నిర్ధారించిన పోలీసులు.. తాజాగా నాలుగో తుపాకీని కూడా వినియోగించినట్లు తెలిపారు. ఇదే సమాంలో.. వాటిని పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. ఈ మేరకు పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా.. పాకిస్థాన్ నుంచి డ్రోన్ సాయంతో తుపాకులను సరిహద్దులు దాటించి.. నిందితులు వాటిని చేజిక్కించుకున్నట్లు మహారాష్ట్ర పోలీసులు చెబుతున్నారు! ఈ తుపాకుల ఫోటోలను రాజస్థాన్ కు పంపినట్లు తెలిపారు. ఇక, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు!

ఈ హత్య కేసుపై తాజాగా పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... హర్యానాకు చెందిన గుబ్ మైల్ బల్జీత్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ధర్మరాజ్ కశ్యప్, వాంటెడ్ నిందితుడు శివకుమార్ గౌతం అనే ముగ్గురు నిందితులూ బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపారు. ఈ ముగ్గురూ సిద్దిఖ్ పై కాల్పులు జరిపే ముందు, కాపాలాగా ఉన్న పోలీస్ అధికారిపై కారం పొడి చల్లారు.

ఇక, పుణేకు చెందిన ప్రవీణ్ లోంకర్ సోదరుడు శుభమ్ లోంకర్ .. జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తో సంబంధం కలిగి ఉన్నాడు. ఈ హత్యకు పూణేకు చెందిన స్క్రాప్ డీలర్ హరీష్ కుమార్ నిసాద్ ఆర్థిక సహాయం అందించాడు. ప్రధాన షూటర్ శివకుమార్ గౌతం తో పాటు కీలక నిందితులు శుభమ్ లోంకర్, మహ్మద్ జీషన్ అక్తర్ లూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

కాగా... తాజాగా ఢిల్లీ పోలీసులు లారెన్స్ బిష్ణోయ్ కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, రాజస్థాన్ నుంచి ఏడుగురు అనుమానిత షూటర్లను అరెస్ట్ చేసింది! వీరి నుంచి బాబా సిద్ధీఖీ హత్యకు సంబంధించిన మరింత సమాచారం వచ్చే అవాకాశం ఉందని అంటున్నారు!

Tags:    

Similar News