పేర్ని రివర్స్ గేర్.. తాడోపేడో తేల్చేసుకోవడమే..!
అలాంటి తీవ్రమైన ఆరోపణ చేశారంటే పేర్నికి ఏమైనా ఆధారాలు లభించాయా? లభిస్తే ఆయన ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గేరు మార్చారు. కొద్ది రోజులుగా ప్రభుత్వంపై విమర్శలకు ఆచితూచి అడుగులేసిన నాని.. సడన్ గా రూటు మార్చారు. ఇక ఏం జరిగితే అదే జరిగుతుంది.. మహా అయితే అరెస్టే చేస్తారు కదా? అన్న నిర్ణయానికి వచ్చేసిన పేర్ని.. రాజకీయ ప్రత్యర్థులపై ఎదురుదాడిని ఎంచుకున్నారని అంటున్నారు. తన అరెస్టు కోసం మంత్రి కొల్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్న పేర్ని.. శుక్రవారం దీనిపై పూర్తి క్లారిటీతో విమర్శలకు దిగారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత నానిలో తెగింపు రావడం ప్రస్తుతం డెల్టా ప్రాంతంలో రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది.
ఉమ్మడి క్రిష్ణా జిల్లా వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేయగా, నెక్ట్స్ మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేశ్ అంటూ టీడీపీ నేతలు పెద్ద లిస్టే చెబుతున్నారు. టీడీపీ నేతలు చెబుతున్నట్లుగానే కూటమి అధికారంలోకి వచ్చాక వీరందరిపై ఏదో ఒక కేసు నమోదైంది. మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడిని అరెస్టు చేయగా, ఆయన న్యాయపోరాటంతో అరెస్టు నుంచి ఉపశమనం పొందారు. ఇక కొడాలికి ముందస్తు బెయిల్ వచ్చింది. పేర్ని నాని కూడా బియ్యం అక్రమ తరలింపు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన సతీమణిని సైతం నిందితురాలిగా చూపడంతో పేర్ని కొద్ది రోజులు డిఫెన్సులో పడినట్లు కనిపించిందని అంటున్నారు. అయితే తన సతీమణి అరెస్టును ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకున్నారని ఓ సందర్భంలో చెప్పిన మాజీ మంత్రి పేర్ని.. ఆ తర్వాత కూటమి ప్రభుత్వంపై విమర్శలకు వెనకడుగు వేశారు.
ఇక ఏమైందో ఏమో గానీ, నెలా పదిహేను రోజులుగా కాస్త సైలెంటుగా ఉన్న పేర్ని.. శుక్రవారం ఒక్కసారిగా ఉగ్రరూపం ప్రదర్శించారు. కొద్దిరోజుల కిందట పార్టీ అధినేత జగన్ విజయవాడ వచ్చి వెళ్లాక పేర్ని తీరులో ఈ మార్పు వచ్చిందని అంటున్నారు. ఏమైతే అదే అయ్యిందన్నట్లు ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు పేర్ని. తనతోపాటు మచిలీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నేతలు, వారి భార్యలు ఫోన్లను పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తనకు స్పష్టమైన సమాచారం ఉన్నట్లు విజయవాడలో 17 మంది కానిస్టేబుళ్లు ఈ పని చేస్తున్నారని తన వద్ద ఆధారాలు ఉన్నాయనే ధైర్యంతో ఆరోపణలు గుప్పించారు.
సడన్ గా పేర్ని ఇలా ఎదురుదాడికి దిగడం అధికార కూటమితోపాటు వైసీపీ క్యాడరులో చర్చకు దారితీసింది. వంశీ అరెస్టు తర్వాత విజయవాడ జైలులో ఆయన అనుభవిస్తున్న బాధలను చూసి ప్రస్టేషనులో ఆ వ్యాఖ్యలు చేశారా? లేక స్పష్టమైన సమాచారంతోనే విమర్శలకు దిగారా? అనే చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ అంటే చిన్న విషయమేమీ కాదు. రహస్యంగా ఇతరుల ఫోన్లను వినడం చట్టరీత్యా నేరం. ఈ ఆరోపణలతోనే తెలంగాణలో పోలీసు ఉన్నతాధికారులు సైతం జైలు ఊచలు లెక్కపెడుతున్నారని గుర్తు చేస్తున్నారు.
అలాంటి తీవ్రమైన ఆరోపణ చేశారంటే పేర్నికి ఏమైనా ఆధారాలు లభించాయా? లభిస్తే ఆయన ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదిఏమైనా సైలెంటుగా కనిపించిన పేర్ని ఒక్కసారి రివర్స్ టర్న్ తీసుకోవడం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు ఎలా ముందుకు వెళతారనేది ఉత్కంఠకు గురి చేస్తోంది. మొత్తానికి ఉమ్మడి క్రిష్ణా జిల్లా రాజకీయం వేసవి సెగకన్నా ఎక్కువ హీట్ పుట్టిస్తోంది.