జగన్ ని తిట్టడం కాదు.....ఓపెన్ అయిన కొలికపూడి !
అయితే ఆయన గత పది నెలలుగా టీడీపీని కెలుకుతూనే ఉన్నారు.;

టీడీపీకి ఆ ఎమ్మెల్యే ఏకు మేకు అవుతున్నారా అంటే అవును అనే జవాబు వస్తోంది. ఆయనే కొలికపూడి శ్రీనివాసరావు. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే. 2024 ఎన్నికల్లో ఆయన గెలిచారు. అయితే ఆయన గత పది నెలలుగా టీడీపీని కెలుకుతూనే ఉన్నారు. తనదైన శైలిలో ఆయన పని చేసుకుంటూ పోతున్నారు.
ఆయన పార్టీ చట్రంలో ఇమడడంలేదు. దాంతోనే వస్తోంది అసలు తంటా. ఆయన తన నియోజకవర్గంలో రమేష్ రెడ్డి అన్న నాయకుడి మీద హై కమాండ్ యాక్షన్ తీసుకోవాలని డెడ్ లైన్ పెట్టి మరీ సంచలనం రేపారు. ఆయన విషయంలో ఏమి చేయాలో కూడా అధినాయకత్వానికి పాలు పోవడం లేదు అని అంటున్నారు.
తాజాగా చూస్తే కనుక కొలికపూడి మరింత సంచలనానికి తెర తీశారు. ఆయన ఏకంగా టీడీపీ హైకమాండ్ కే గుచ్చేలా హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలు టీడీపీ కూటమికి ఓట్లేసింది జగన్ కంటే మంచి పాలన అందించమని అని అంటున్నారు. అంతే తప్ప రోజూ జగన్ ని తిట్టమని ఓట్లు వేయలేదు అని అన్నారు.
కొలికపూడి ఈ హాట్ కామెంట్స్ చేయడం ద్వారా ఎవరికి ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పేశారు అని అంటున్నారు. జగన్ విషయంలో అయితే ఇప్పటికీ కూటమి పెద్దల నుంచి అంతా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అది అసెంబ్లీ అయినా బయట సభ అయినా మీడియా మీట్ అయినా మరే కార్యక్రమం అయినా కూడా జగన్ ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు అన్నది వైసీపీ వారు వైపు నుంచి వచ్చే విమర్శ.
అయితే ఇపుడు అదే విమర్శలు కొలికపూడి చేస్తున్నారు అంటే వ్యవహారం చాలానే ఉంది అని అంటున్నారు కొలికపూడి విషయంలో హైకమాండ్ విచారణకు ఒక కమిటీని వేసింది అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన రియాక్షన్ మాత్రం వైల్డ్ గానే ఉంది అని అంటున్నారు. సాధారణంగా ప్రతీ పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది.
ఏపీలో టీడీపీ కూటమి విషయం తీసుకుంటే వైసీపీని అన్ని విధాలుగా దెబ్బతీయాలని చూస్తోంది. అందుకే ఆ పార్టీ మీద కామెంట్స్ చేస్తూ గట్టిగా టార్గెట్ చేస్తోంది. ఇది రాజకీయంగా టీడీపీ వ్యూహంగా ఉంది అనుకోవాలి. కానీ కొలికపూడి మాత్రం ఇది తప్పు అంటున్నట్లుగానే మాట్లాడారు. ప్రజలు ఓటేసింది మంచి పాలన అందించడానికి తప్ప జగన్ ని తిట్టడానికి కాదు అని అన్నారు. ఆ విధంగా ఆయన మాట్లాడడం వెనక జగన్ కి మద్దతుగా వ్యవహరిస్తున్నట్లుగా సౌండ్ ఏమైనా ఉందా అన్న చర్చ సాగుతోంది.
అదే సమయంలో ఇప్పటిదాకా చూస్తే కనుక టీడీపీ సహా కూటమి పార్టీల నుంచి కూడా ఎవరూ ఈ విధంగా మాట్లాడలేదు. మరి కొలికపూడి ఈ హాట్ కామెంట్స్ చేశారు అంటే కనుక ఆయన అన్నింటికీ రెడీ అన్నట్లుగానే భావించి ఓపెన్ అవుతున్నారా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఈ తరహా కామెంట్స్ చేయడం టీడీపీ ఏ విధంగానూ తట్టుకోలేనిదే అవుతుంది అని అంటున్నారు. మరి ఆయన చేసిన ఈ కామెంట్స్ మీద టీడీపీ ఏ విధంగా రియాక్టు అవుతుందో చూడాల్సి ఉంది అంటున్నారు.