ఓపెన్ఏఐ కొత్త ఫీచర్.. చాట్‌జీపీటీతో నకిలీ ఆధార్, పాన్ కార్డులు

చాట్‌జీపీటీ కేవలం ఆధార్ కార్డులనే కాకుండా పాన్ కార్డులను కూడా నకిలీగా తయారు చేయగలగడం మరింత ప్రమాదకరమైన విషయం.;

Update: 2025-04-04 23:30 GMT
ఓపెన్ఏఐ కొత్త ఫీచర్.. చాట్‌జీపీటీతో నకిలీ ఆధార్, పాన్ కార్డులు

కొద్ది రోజుల క్రితం స్టూడియో గిబ్లీ శైలిలో అద్భుతమైన చిత్రాలను రూపొందించి అందరినీ అలరించిన AI యాప్ చాట్‌జీపీటీ ఇప్పుడు మరో సంచలనానికి తెరతీసింది. గిబ్లీ ఫోటోలతో సందడి చేసిన ఈ AI టూల్ తాజాగా నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులను సైతం తయారు చేస్తోంది. చూడటానికి అచ్చం అసలైన వాటిలానే ఉండటంతో వీటిని గుర్తించడం కూడా కష్టంగా మారుతోంది. ఈ పరిణామం డిజిటల్ మోసాలు పెరిగే ప్రమాదాన్ని సూచిస్తోంది.

వివరాల్లోకి వెళితే, చాట్‌జీపీటీ ఇటీవల తన ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలను మరింత మెరుగుపరిచింది. దీనిలో భాగంగానే గిబ్లీ శైలి చిత్రాల తయారీ ఫీచర్ బాగా పాపులర్ అయింది. అయితే, కొందరు దుర్మార్గులు ఈ కొత్త ఫీచర్‌ను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. కేవలం కొన్ని ప్రాంప్ట్‌లు ఇవ్వడం ద్వారా చాట్‌జీపీటీ ఎవరిదైనా నకిలీ ఆధార్ కార్డును క్షణాల్లో రూపొందిస్తోంది.

సోషల్ మీడియా వేదికలపై ఇప్పుడు నకిలీ ఆధార్, పాన్ కార్డుల చిత్రాలు దర్శనమిస్తున్నాయి. పలువురు వినియోగదారులు తాము AI ద్వారా సృష్టించిన నకిలీ గుర్తింపు కార్డులను తమ అసలైన కార్డులతో పోల్చి చూపిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నకిలీ కార్డులపై ఉన్న సమాచారం, క్యూఆర్ కోడ్‌లు కూడా చాలా నమ్మేటట్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

చాట్‌జీపీటీ కేవలం ఆధార్ కార్డులనే కాకుండా పాన్ కార్డులను కూడా నకిలీగా తయారు చేయగలగడం మరింత ప్రమాదకరమైన విషయం. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌పై పలువురు వినియోగదారులు AI రూపొందించిన పాన్,ఆధార్ కార్డుల చిత్రాలను షేర్ చేస్తూ, ఈ టూల్ ఎంత వేగంగా నకిలీ డాక్యుమెంట్లను తయారు చేస్తోందో చూడండి అంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున నేరాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాట్‌జీపీటీ ఈ కొత్త సామర్థ్యం AI టెక్నాలజీ దుర్వినియోగం ఏ స్థాయికి చేరుకుందో తెలియజేస్తోంది. ఒకవైపు క్రియేటివిటీని పెంపొందించడానికి ఉపయోగపడే AI టూల్స్ మరోవైపు మోసాలకు పాల్పడే వారికి ఆయుధంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, AI సంస్థలు తమ టూల్స్‌ను దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే, ప్రజలు కూడా ఆన్‌లైన్‌లో కనిపించే గుర్తింపు కార్డుల ప్రామాణికతను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News