ఇప్పటికే ఎన్నో చేశాం.. ఇంకా చేస్తాం.. కానీ!: చంద్రబాబు
తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో పర్యటించిన ఆయన చెత్త నుంచి పునరుత్పాదక ఇంధన వనరులను తయారు చేసే ప్లాంటును ప్రారంభించారు.
''కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలే అయింది. ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేశాం. పింఛన్లు పెంచి రూ.4000 ఇస్తున్నాం. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నాం. అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని చెప్పాం. చెప్పినట్టే చేస్తున్నాం'' అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో పర్యటించిన ఆయన చెత్త నుంచి పునరుత్పాదక ఇంధన వనరులను తయారు చేసే ప్లాంటును ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించారు. తమకు ఎన్నో చేయాలని ఉందని ఆయన చెప్పారు.
''ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేశాం. అయినా..ఇంకా చేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నా రు. మాకు కూడా చేయాలనే ఉంది. కానీ, గత ప్రభుత్వం దోపిడీ చేసింది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. దీంతో 10 లక్షల కోట్ల వరకు అప్పులు తీర్చాల్సి ఉంది. ఈ అప్పులకు వడ్డీలు కట్టేందుకే అప్పులు చేసే పరిస్థితి వచ్చిందంటే మీరు ఆలోచించాలి. అయినప్పటికీ.. ఆర్థిక భారం పడుతున్నా నెలకు రూ.1000 చొప్పున పెంచి సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేస్తున్నాం. ఇక ముందు కూడా అనేక పథకాలను అమలు చేస్తాం. ప్రజలు కూడా ఆలోచించాలి. సంపద సృష్టించేందుకు మేం పడుతున్న కష్టాన్ని గుర్తించాలి'' అని చంద్రబాబు సూచించారు.
పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు కూడా నడుం వంచాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సమాజ బాధ్యత విషయంలోనూ దృష్టి పెట్టాలన్నారు. నెలకు ఒక రోజు సమాజం కోసం కేటాయించాలని సూచించారు. పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. సంపద సృష్టిస్తాం.. అది పేదలకు పంచుతాం.. అని మరో సారి ఆయన ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఆర్థికసమస్యలు కుంగదీస్తున్నా.. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్న ట్టు చెప్పారు. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుందని.. ఆ దిశగా ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించాలని సూచించారు.
నేరస్తుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ''మీరు తప్పులు చేసినంత వరకు.. నేను వదిలి పెట్టను. చట్టం ప్రకారం శిక్షించి తీరుతాం. నేరాలు చేసి.. తప్పించుకునే ప్రయత్నం చేస్తే.. ఊరుకుంటామని అనుకుంటారా? కిడ్నాపులు చేస్తారు. హత్యలు చేస్తారు. అయినా.. ఊరుకోవా లా?'' అని నిలదీశారు. ప్రజలు ఇలాంటి నేరస్థుల విషయంలో కూడా ఆలోచన చేయాలని సూచించారు. మహిళా భద్రతకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు.