రాక్షస మిల్టన్ హరికేన్ తో ఫ్లోరిడా ప్రజలకు బిగ్ అలర్ట్!

ఈ పెను విపత్తు తుఫాను తీరప్రాంతలను బలంగా తాకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Update: 2024-10-08 05:53 GMT

మిల్టన్ హరికేన్ అత్యంత ప్రమాదకరమైన ఐదో కేటగిరీ తుఫానుగా తీవ్రరూపం దాల్చి ఫ్లోరిడాను వణికించనుంది. మెక్సికో యుకాటాన్ ద్వీపకల్పం నుంచి దాటుతున్న సమయంలో గంటకు 285 కి.మీ. (గంటకు 180మైల్స్) వేగంతో భయంకరమైన గాలులు వీస్తున్నాయి. ఈ పెను విపత్తు తుఫాను తీరప్రాంతలను బలంగా తాకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అవును.. మిల్టన్ హరికేన్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ సమయంలో ఫ్లోరిడియన్ లు చాలా సంవత్సరాల తర్వాత రాష్ట్రం నుంచి భారీ ఎత్తున తరలింపు ప్రయత్నాలకు సిద్ధంకావాలని గవర్నర్ రాన్ డిసాంటిస్ హెచ్చరించారు. ఇదే సమయంలో... చాలామంది ప్రజలు తరలింపు ఆదేశాలను అనుసరిస్తున్నందున అంతరాష్ట్ర ట్రాఫిక్ నిలిచిపోయిందని టంపా మేయర్ జెన్ కాస్టర్ తెలిపారు.

సుమారు 3.3 మిలియన్లకు పైగా జనాభా ఉన్న ఫ్లోరిడాలోని టంపా మెట్రో ప్రాంతాన్ని మిల్టన్ తుఫాను నేరుగా ఢీకొనే అవకాశం ఉందని అంటున్నారు. ఓ వైపు హెలెన్ తుపాను కారణంగా ఏర్పడిన శిథిలాలను అధికారులు ఇంకా పూర్తిస్థాయిలో తొలగించకముందే.. మిల్టన్ ఈ స్థాయిలో దూసుకొస్తుండటంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం... మిల్టన్ బుధవారం ఫ్లోరిడా పశ్చిమాన తీరం దాటనుందని అంటున్నారు. ఇది టంపా బే ప్రాంతాన్ని తాకినప్పుడు బలహీనపడి కేటగిరీ 3 తుపానుగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సోమవారం సాయంత్రం తూర్పు గల్ఫ్ ఆఫ్ మెక్సికో దగ్గర ఇది కేంద్రీకృతమైంది.

ఈ విషయాలపై స్పందించిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజల క్రితం అంచనావేసిన దానికంటే ఈ మిల్టన్ హరికేన్ ఇప్పటికీ చాలా బలంగా ఉందని తెలిపారు. ఇక టంపా బేలో 8 నుంచి 12 అడుగుల ఎత్తు వరకూ తుపాను విజృంభించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

హెలెన్ సమయంలో రెండు వారాల క్రితం చేరుకున్న స్థాయిల కంటే ఈ మిల్టన్ హరికేన్ రెట్టింపు స్థాయి అని నేషనల్ హరికేన్ ప్రతినిధి తెలిపారు. ఈ తుఫాను కూడా విస్తారంగా వరదలను తీసుకురావొచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో... మంగళవారం ఉదయం 9 గంటల వరకూ విమానాలను నిలిపివేసినట్లు టంపా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తెలిపింది.

Tags:    

Similar News