బీజేపీ ట్రిపుల్ రైడింగ్.. ఇదేం నిర్ణయం... !
బీజేపీ.. కూడా ఏపీలో ఉన్న కూటమి సర్కారులో భాగస్వామ్య పార్టీనే అయితే.. ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి
బీజేపీ.. కూడా ఏపీలో ఉన్న కూటమి సర్కారులో భాగస్వామ్య పార్టీనే అయితే.. ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. పైకి మాత్రం పెద్ద నేతలు మౌనంగా ఉన్నా.. క్షేత్ర స్థాయిలో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం కూటమిలో కల్లోలానికి దారి తీస్తోంది. పైగా.. పార్టీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి.. సీనియర్లకు నేనేమీ చెప్పలేకపోతున్నానని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో అసలు బీజేపీ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నిర్ణయాలు చాలా చిత్రంగా ఉన్నాయి. బీజేపీ స్థానిక నాయకత్వం ఒకరికి మద్దతిస్తే.. రాష్ట్ర నాయకత్వం మరో నాయకుడికి మద్దతిస్తున్నట్టు ప్రకటించింది. పైగా.. అది కూడా ఒక ప్రాంతానికి ఒక సీటుకు పరిమితం కావడం మరింత చిత్రంగా అనిపిస్తోంది. తాజాగా పురందేశ్వరి.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూటమి అభ్యర్థి.. ఆలపాటి రాజాకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ పట్టభద్రులు అందరూ ఆయనకే ఓటేయాలన్నారు.
మంచిదే.. మరి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అభ్యర్థి మాటేంటి? అనేది ప్రశ్న. పైగా నొక్కి మరీ ఆమె రాజా రాజా అంటూ.. నాలుగు సార్లు చెప్పారు. అదేసమయంలో ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్ర స్థానంలో పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతు ఇచ్చే విషయాన్ని ఆమె అసలు పట్టించుకో లేదు. ఇక్కడ బీజేపీ స్థానిక నాయకులు.. పేరాబత్తులను కాదని.. కాంగ్రెస్ మాజీ నాయకుడు.. హర్షకుమార్ తనయుడికి లోపాయికారీ మద్దతు ప్రకటించారు. దీనిని ఆమె సమర్థిస్తున్నట్టు అయింది.
ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో రఘువర్మ పోటీలో ఉండగా.. ఈయనకు కూటమిపార్టీలు రెండూ.. టీడీపీ, జనసేనలు మద్దతు ప్రకటించాయి. కానీ... ఇక్కడ కూడా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని కూడా పురందేశ్వరి దాట వేశారు. అంటే.. మూడు ప్రాంతాల్లో మూడు విధాలుగా .. పార్టీ నిర్ణయాలు ఉండడం పై విస్మయం వ్యక్తమవుతోంది. తీసుకుంటే.. ఒకే లైన్ తీసుకోవాలని.. లేకపోతే.. మౌనంగా ఉండాలని.. ఇలా చేస్తే.. పార్టీ పరువు పోతుందని.. సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.