బీజేపీ కొత్త నినాదం - ట్రిపుల్ ఇంజిన్ సర్కార్!
2014 నుంచి తాజాగా ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన వరుస ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలు మెజార్టీ రాష్ట్రాల్లో కొలువుదీరాయి. మొత్తం 28 రాష్ట్రాలకు 15 చోట్ల బీజేపీ ప్రభుత్వాలే పాలిస్తున్నాయి.
ఎన్నికల్లో బీజేపీ పాపులర్ నినాదం డబుల్ ఇంజిన్ సర్కార్.. ఇలా ప్రచారం చేసుకునే దేశంలో 15 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను స్థాపించింది బీజేపీ. అదేవిధంగా మరో ఐదు రాష్ట్రాల్లో బీజేపీ భాగస్వామ్య కూటమి అధికారంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రాల్లో అధికారం సాధించేందుకు బీజేపీ ఎక్కువగా డబుల్ ఇంజిన్ సర్కార్ స్థాపించాల్సిన అవసరం ఉందనే ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు బదులుగా ట్రిపుల్ ఇంజన్ అంటూ కమల నాథులు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అదేంటి కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వం ఉండటమే డబుల్ ఇంజిన్ కదా.. మరి ట్రిపుల్ ఇంజన్ ఏంటా? అని అనుమానిస్తున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి..
దేశంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా ఎగరేయాలని ప్రధాని మోదీ ప్లాన్ చేశారు. కేంద్రంలో అధికారం వచ్చిన నుంచి గత పదేళ్లుగా జరిగిన ఎన్నికల్లో బీజేపీకి కాస్త బలం ఉన్నా, ఆ రాష్ట్రంలో కమలం జెండా ఎగిరేలా వ్యూహ రచన చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాజకీయ చతురతతో దేశవ్యాప్తంగా కమలం హవా కొనసాగింది. 2014 నుంచి తాజాగా ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన వరుస ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలు మెజార్టీ రాష్ట్రాల్లో కొలువుదీరాయి. మొత్తం 28 రాష్ట్రాలకు 15 చోట్ల బీజేపీ ప్రభుత్వాలే పాలిస్తున్నాయి.
డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే నిధుల విడుదలలో సమస్య ఉండదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి అభివృద్ధిని పరుగులు పెట్టించవచ్చని ప్రతి ఎన్నికల్లోనూ ప్రచారం చేసేవారు బీజేపీ నేతలు. వారి మాటలను ప్రజలు విశ్వసించి పట్టం కట్టారు. అయితే ఇప్పుడు బీజేపీ ప్రచారాన్ని మరింత విస్తరించింది. డబుల్ ఇంజన్ పోయి ట్రిపుల్ ఇంజన్ సర్కారు తెద్దామంటూ ప్రజలకు పిలుపునిస్తోంది.
అయితే ట్రిపుల్ ఇంజిన్ ఏంటన్న సందిగ్ధత చాలామందిలో కనిపిస్తోంది. దీనికి తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేందర సచ్ దేవ్. ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీలో సుదీర్ఘ కాలం తర్వాత గెలిచిన బీజేపీ.. ఇప్పుడు తన నెక్ట్స్ టార్గెట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అంటోంది. ప్రస్తుతం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆప్ చేతిలో ఉంది. వచ్చే ఏప్రిల్ లో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలు.. కార్పొరేషన్ లోనూ గెలిపించి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేసేలా మద్దతు పలకాలని బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ పిలుపునిస్తున్నారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత ఆప్ పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ ప్రజలకు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ సాధనకు మద్దతు పలకాలని పిలుపునివ్వడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది. ఏదైనా కమలనాథులు అనుకుంటే సాధించేవరకు విశ్రమించరని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేశాయి. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గద్దెపై జెండా ఎగరేసిన కమలం నేతలు నెక్ట్స్ తమ గురి కార్పొరేసన్ అంటున్నారు. మరి వారి ఆశలు ఫలిస్తాయా? డబుల్ ఇంజిన్ సర్కారుకు ఓటు వేసిన ప్రజలు.. ట్రిపుల్ ఇంజిన్ ప్రచారానికి మద్దతుగా నిలుస్తారో? లేదో? చూడాల్సివుంది.