అప్రూవర్ గా బోరుగడ్డ...వైసీపీని లోతుగా తవ్వేస్తారా ?

వైసీపీ సానుభూతిపరుడుగా బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ అయిదేళ్ల అధికారంలో చెలరేగిపోయారు.

Update: 2024-12-11 03:57 GMT

వైసీపీ సానుభూతిపరుడుగా బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ అయిదేళ్ల అధికారంలో చెలరేగిపోయారు. వారూ వీరూ తేడా లేకుండా హద్దులు దాటి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ వెళ్ళారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లను లక్ష్యంగా చేసుకుని ఆయన ఎంతకైనా అన్నట్లుగా తెగించారు.

దాంతో ఆయన సోషల్ మీడియా పెట్టే పోస్టింగులు అన్నీ దారుణంగా ఉండడమే కాకుండా టీడీపీ జనసేనలకు మంట పుట్టించేవి. ఇక వైసీపీ సానుభూతిపరుడిని అని చెబుతూ పెద్దల మద్దతు ఉందని కూడా పేర్కొంటూ బోరుగడ్డ చేయని అక్రమం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఆయన భూకబ్జాలకు సైతం పాల్పడ్డారని అంటున్నారు.

ఇలా అనేక కేసులు చుట్టు ముట్టి ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఊచలు లెక్కిస్తున్న బోరుగడ్డకు చుక్కలు కనిపిస్తున్నాయని అంటున్నారు. గుంటూరుకు చెందిన ఓ పాస్ట‌ర్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు బోరుగ‌డ్డ‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్న క్రమంలో ఆయన నోటి వెంట నిజాలు చెప్పించాలని చూస్తున్నారు.

ఒక సాధారణ మనిషి అయిన బోరుగడ్డ చంద్రబాబు పవన్ వంటి వారిని విమర్శించే స్థాయిలో ఉండే చాన్స్ లేదని ఆయన వెనక పెద్దలు ఉండి ఉంటారని భావిస్తూ ఆ విధంగా కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. అనేక జిల్లాలలో బోరుగడ్డ మీద కేసులు పడడంతో అంతా వచ్చి జైలులోనే బోరుగడ్డను విచారిస్తున్నారు.

ఇంకో వైపు చూస్తే బోరుగడ్డకు వైసీపీ నుంచి ఎలాంటి న్యాయ సాయం దక్కడంలేదని అంటున్నారు. సానుభూతి కూడా లభించడం లేదు. దాంతో బోరుగడ్డలో మరింత చిక్కులలో పడుతున్నారు. పోలీసులు ఇచ్చే ట్రీట్మెంట్ తో ఆయనలోని నిజాలు అన్నీ గటగటా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే బోరుగడ్డ అప్రూవర్ గా మారుతున్నారు అని అంటున్నారు. తన మీద గట్టిగా బిగుస్తున్న ఈ ఉచ్చు నుంచి తప్పించుకోవాలంటే అప్రూవర్ గా మారడమే మంచిదని ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఇక తాను సోషల్ మీడియా వేదికగా చేసిన అనుచిత కామెంట్స్ బెదిరింపుల వెనక తాడేపల్లి కేంద్రంగా వైసీపీలో కీలకంగా పనిచేసే ఇద్దరు వ్యక్తులు ఉన్నారని బోరుగడ్డ పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది.

ఆ ఇద్దరూ తాడేపల్లి కేంద్రంగానే రాజకీయాలు చేస్తారని బయటకు రారని బోరుగడ్డ పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో బోరుగడ్డను మరింత లోతుగా విచరించే పనిలో పోలీసులు ఉన్నారని అంటున్నారు. ఇలా పోలీస్ మార్క్ విచారణ మరింత తీవ్రమైతే బోరుగడ్డ తట్టుకోలేక అప్రూవర్ గా మారడం ఖాయమని అంటున్నారు. అంతే కాదు ఆయన వైసీపీ నేతల మీద తీవ్ర విమర్శలు చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

ఈ కేసులు ఏవీ తన మెడకు చుట్టుకోకుండా ఉండాలంటే తాను అప్రూవర్ గా మారడమే బెటర్ అని బోరుగడ్డ అనుకుంటే మాత్రం వైసీపీలోని కొందరు కీలక నేతలకు డేంజర్ బెల్స్ మోగినట్లే అని అంటున్నారు. సోషల్ మీడియా సహా ఇతర కీసులు కూడా కొందరు నేతలకు చుట్టుకుంటాయని అంటున్నారు. అదే జరిగితే వైసీపీకి మరింత నష్టం కలిగిస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి బోరుగడ్డ వైసీపీ లోతులు మొత్తం తవ్వేస్తారా అన్నది.

Tags:    

Similar News