పథకాలకు పైసలు ఎలా?
బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నిశాఖల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నారు. అయితే ఎవరు ఏ ప్రతిపాదన సమర్పించినా, అంతిమంగా ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్ అంటున్నారు.
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి బడ్జెట్ ప్రవేశపెట్టడమే పెద్ద సవాలుగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉండటంతో బడ్జెట్ లెక్కలు తయారు చేయడం భారంగా మారుతోందని అంటున్నారు. నిధుల లభ్యతగా పరిమితంగా ఉండటంతో ఖర్చులకు కోతపెట్టేలా నిర్ణయాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వార్షిక బడ్జెట్ తయారీపై ఆర్థిక మంత్రి కేశవ్ కసరత్తు చేస్తున్నారు. శాఖలవారీగా నివేదికలు తెప్పించుకుంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలు ఏ పథకాలు అమలు చేయాలి? ఎంతమేర నిధులు అవసరమవుతాయనే విషయంపై సమాచారం తెప్పించుకుంటున్నారు. అయితే ప్రభుత్వం నుంచి భారీగా సాయం ఆశిస్తున్న మంత్రులు.. ఆర్థిక మంత్రి అంచనాకు మించి నిధులు అడుగుతున్నారని చెబుతున్నారు. దీంతో ఈ నెల 28న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది.
బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నిశాఖల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నారు. అయితే ఎవరు ఏ ప్రతిపాదన సమర్పించినా, అంతిమంగా ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో నిధుల సేకరణే కత్తిమీద సాములా మారిందంటున్నారు. ముఖ్యంగా ఖర్చులు పెరిగిపోవడం, ఆ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో చాలా మంత్రిత్వ శాఖల్లో దైనందిన కార్యకలపాలకు కూడా మీనమేషాలు లెక్కించాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఏమైనా ఉపశమనం కల్పిస్తారా? లేదా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
ప్రభుత్వం ఏర్పడి 9 నెలల కావస్తోంది. సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తొలి ఆరు నెలలు వ్యవస్థలను బాగుచేస్తున్నామని చెప్పుకొచ్చింది. దీంతో ప్రజలు, ప్రతిపక్షాలు మొదటి ఆరు నెలలు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనే కోణంలో పెద్దగా ఒత్తిడి చేయలేదు. ఇక ఆరు నెలల తర్వాత కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల జోలికి వెళ్లడం లేదు. దీనికి ప్రధాన కారణం గతంలో తెచ్చిన అప్పులు, ఆదాయం లేకపోడమేనని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం వద్ద డబ్బు లేనందున సంక్షేమ పథకాలకు మరికొన్ని రోజులు వేచిచూడాలని వాయిదా వేస్తోంది. అయితే ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చినా ప్రజలు మాత్రం ప్రధానంగా నాలుగైదు హామీలు పక్కాగా అమలు చేస్తారని ఎదురుచూస్తున్నారు. తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ, మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం వంటివి ఇందులో ఉన్నాయి.
అయితే సంక్షేమంతోపాటు అభివృద్ధి ప్రధానమంటున్న సీఎం.. ప్రస్తుతం అభివృద్ధిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. రాజధాని అమరావతితోపాటు పోలవరం నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు. కానీ, సంక్షేమ పథకాలకు మాత్రం సమయం కావాలనే అంటున్నారు. కానీ, ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుందని తెలుసుకుని వచ్చే మే నెలలో అన్నదాతా సుఖీభవ, తల్లికి వందనం అమలు చేస్తామని ఇటీవల మంత్రివర్గం సమావేశంలో వెల్లడించారు.
సూపర్ సిక్స్ హామీల్లో రెండింటిని బలవంతంగా అయినా అమలు చేయాల్సిన పరిస్థితి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందంటున్నారు. ఇప్పటికే తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాలకు ఓ ఏడాది నిలిపిసినట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వం అమ్మ ఒడి పథకానికి బదులుగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం తీసుకువచ్చింది. ఏటా జూన్ లో అమ్మ ఒడి డబ్బు జమ చేసేవారు. అయితే గత ఏడాది సరిగ్గా అదే సమయానికి ఫలితాలు రావడం, ప్రభుత్వం కొత్తగా కొలువుదీరడంతో అమ్మ ఒడి నిలిచిపోయింది. ఇక అన్నదాతా సుఖీభవ పథకానిదీ ఇదే పరిస్థితి. దీంతో ఈ ఏడాది ఈ రెండు పథకాలకు ఖచ్చితంగా నిధులు సమకూర్చాల్సివుంది.
తల్లికి వందనం పథకానికి కనీసం రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదేవిధంగా అన్నదాతా సుఖీభవ పథకానికి రూ.15 వేల కోట్లు అవసరం అని లెక్కవేస్తున్నారు. గత ప్రభుత్వం ఏడాదికి సుమారు 9 వేల కోట్లు ఖర్చు చేసేది. అయితే వైసీపీ సర్కారు కన్నా రూ.6,500 ఎక్కువ ఇస్తామని చంద్రబాబు ప్రకటించడంతో ఆ మేరకు నిధులు పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే వచ్చే మూడు నెలల్లోనే ప్రభుత్వం కనీసం రూ.25 వేల కోట్లు రెడీ చేసుకోవాల్సి ఉందని అంటున్నారు. అయితే మొత్తం నిధులు ఒకేసారి జమ చేయకుండా? వాయిదాల రూపంలో డబ్బు పంపిణీ చేయాలనే ప్రతిపాదన పరిశీలిస్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని ఒకేసారి అమలు చేసినా, అన్నదాతా సుఖీభవ పథకాన్ని కేంద్రం ప్రభుత్వం పంపిణీ చేస్తన్నట్లు మూడు వాయిదాలలో అమలు చేయాలని చూస్తున్నారు. అన్నదాతా సుఖీభవ పథకానికి కేంద్రం తన వాటాగా రూ.6 వేలు ఇస్తుంది. దీనికి రూ.14 వేలు రాష్ట్ర ప్రభుత్వం కలపాల్సివుంటుంది. అయితే కేంద్రం ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా జమచేస్తుంది. గత ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. దీంతో చంద్రబాబు సర్కార్ కూడా వాయిదా పద్ధతిపైనే మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు.
మొత్తానికి ఏదిఏమైనా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే రెండో నెలలో ఓ పథకం, మూడో నెలలో మరో కీలక పథకం అమలు చేయాల్సివుండటం చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ గా మారింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఆదాయం పెరగకపోవడం, కొత్తగా చేస్తున్న అప్పుల్లో అభివృద్ధికి కూడా సింహభాగం ఖర్చు చేయాల్సివుండటంతో సంక్షేమానికి నిధులు ఎలా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరిన్ని అప్పులు చేస్తారా? లేక గత ప్రభుత్వం అనుసరించిన తనఖా విధానాన్ని ఫాలో అవుతారా? అనేది ఆసక్తిరేపుతోంది. ఏదిఏమైనా సంక్షేమ సవాళ్ల నుంచి చంద్రబాబు ఎలా గట్టెక్కుతారనేది అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.