విందు పెట్టి.. కారును సమాధి చేసిన రైతు కుటుంబం

గుజరాత్‌లోని ఓ కుటుంబం వినూత్నంగా ఓ పని చేసింది. తమ జీవితంలో ఫస్ట్ టైమ్ కొనుగోలు చేసిన కారుకు గ్రాండుగా అంత్యక్రియలు నిర్వహించారు.

Update: 2024-11-09 09:30 GMT

లైఫ్‌లో ఫస్ట్ కొనుక్కున్న కారు.. ఫస్ట్ కొన్న ఫోన్.. ఫస్ట్ కొన్న ల్యాప్‌టాప్.. ఫస్ట్ కొన్న బైక్.. ఎప్పటికీ ప్రత్యేకమే. కొత్త కొత్త అప్‌డేట్స్ వచ్చి.. వాటి స్థానాల్లో కొత్త వాటిని కొనుగోలు చేసినా పాతవాటిని మాత్రం అలానే దాచుకుంటూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి గుర్తువచ్చినప్పుడు వాటిని చూస్తూ నాటి రోజులు గుర్తుచేసుకుంటూ ఉంటాం. ఇంకొందరేమో ఆ వస్తువు వల్లే తమకు కలిసివచ్చిందని భావించి దాచుకుంటూ ఉంటారు. ఒకవేళ వాటిని పడేయాల్సిన పరిస్థితే వస్తే అప్పుడు కలిగే బాధ అంతా ఇంతా కాదు.

అయితే.. గుజరాత్‌లోని ఓ కుటుంబం వినూత్నంగా ఓ పని చేసింది. తమ జీవితంలో ఫస్ట్ టైమ్ కొనుగోలు చేసిన కారుకు గ్రాండుగా అంత్యక్రియలు నిర్వహించారు. 12 ఏళ్లు వాళ్ల కుటుంబానికి కలిసివచ్చిన ఆ పాత లక్కీ కారుకు గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు.. గ్రామస్తులను అందరినీ పిలిచి పెద్ద ఎత్తున విందు భోజనం పెట్టారు. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాకు చెందిన రైతు కుటుంబం చేసిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

గుజరాత్‌లోని పదర్శింగ గ్రామానికి చెందిన సంజయ్ పోలారాది రైతు కుటుంబం. 2006లో వీరు ఓ కారు కొనుగోలు చేశారు. ఆ కారు కొన్నప్పటి నుంచి ఆ కుటుంబానికి బాగా కలిసొచ్చింది. ఆ కుటుంబానికి వ్యాపారంలో కూడా భారీగా కలిసొచ్చింది. సంపద పెరిగి కుటుంబ మంచిగా స్థిరపడింది. దీంతో ఆ కుటుంబసభ్యులంతా ఆ కారును లక్కీ కారుగా భావించారు. అంతేకాదు.. తమ కుటుంబంలో ఓ సభ్యుడిగా మెయింటెన్ చేశారు.

అయితే.. ఇటీవల దాని సర్వీస్ కాలం పూర్తయింది. దాంతో ఆ కారును వదులుకోలేక.. తమ పొలం వద్దే సమాధి చేయాలని వ్యాపారి నిర్ణయం తీసుకున్నాడు. అందుకు నాలుగు పేజీలతో కూడిన ఇన్విటేషన్లను తయారుచేయించాడు. ఏకంగా రెండు వేల మందిని ఆహ్వానించాడు. కారును పూలతో అందంగా అలకరించారు. వారి ఆచారం ప్రకారం స్థానికులు, మత పెద్దలతో పూజలూ చేయించారు. ప్రార్థనలు కూడా చేశారు. గ్రీన్‌మ్యాట్‌తో కప్పేసి 15 అడుగుల లోతు గొయ్యిలో కారును సమాధి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన 1500 మందికిపైగా గ్రామస్తులకు భోజనం పెట్టారు. ఇందుకు ఆ వ్యాపారి రూ.4 లక్షలకు పైగా ఖర్చు చేశారు. కారును జ్ఞాపకాలు తమ నుంచి దూరం కాకుండా సమాధి చుట్టూ మెమోరియల్ కూడా ఏర్పాటు చేస్తామని వ్యాపారి సంజయ్ పోలారా చెప్పారు.

Tags:    

Similar News