జగన్‌పై కేసు... కూటమి సర్కారుకు తలనొప్పే..!
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలోనే ఆయన బెయిల్ రద్దు చేయాలని ఆయనపై నమోదు అయిన సిపిఐ కేసుల విచారణ వేగవంతం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వైసిపి మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. తనను అక్రమంగా నిర్బంధించాలని. తనపై హత్యాయత్నం చేశారని తన మరణా నికి జగన్మోహన్ రెడ్డి స్కెచ్ వేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇది ఎంతవరకు న్యాయ పరిధిలో నిరూపించబడుతుంది.. అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై గతంలోనే రఘురాం కృష్ణంరాజు ఒక యుద్ధం చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలోనే ఆయన బెయిల్ రద్దు చేయాలని ఆయనపై నమోదు అయిన సిపిఐ కేసుల విచారణ వేగవంతం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం ఆ పిటిషన్ లన్ని విచారణ పరిధిలో ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం మారిన తర్వాత గతంలో తనపై నమోదైన కేసుల విషయాన్ని తిరగదు తాజాగా అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అప్పటి ఇంటిలిజెన్స్ ఐజి సీతారామాంజనేయులపై అదేవిధంగా గుంటూరు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిపై రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. గుంటూరు పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేశారు.
అయితే అధికారుల విషయాన్ని పరిశీలిస్తే వారంతా ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకున్నామని తమ తప్పేమీ లేదని వ్యక్తిగతంగా తామేమి చర్యలు తీసుకోలేదని చెప్పే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా అధికారులు ఆ ప్రభుత్వం చెప్పినట్టు మాత్రమే వింటారు. ఆ ప్రభుత్వం పరిధిలోనే అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి అధికారుల వాదన ఇక్కడ ప్రధానంగా గత ప్రభుత్వం చుట్టూ తిరుగుతుంది. ఇక ముఖ్యమంత్రి పై నమోదైన విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఏ-3 గా పేర్కొంటూ గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
హత్యాయత్నం ఆరోపణ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసినట్టు గుంటూరు పోలీసుల ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ ఇది కూడా న్యాయ పరిధిలో ఎంతవరకు నిలబడుతుంది? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఈ కేసు జరిగి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత దీనిపై పునర్విచారణ కోరుతూ ఎంపీ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన అభ్యర్థన కోర్టులు పరిగణలోకి ఎంతవరకు తీసుకుంటాయి? అనేది చూడాలి. ఎందుకంటే ఏదైనా కేసుకు సంబంధించి 77 రోజుల్లో సాక్ష్యం గనుక లేకపోతే ఆ కేసును పరిగణలోకి తీసుకునే విషయంలో పునరాలోచించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ఈ నేపథ్యంలో రెండున్నర సంవత్సరాల తర్వాత ఒక కేసుకు సంబంధించి అది కూడా సుప్రీంకోర్టు విచారించి, రఘురామకు హైదరాబాదులోని మిలటరీ ఆసుపత్రిలో పరీక్షలు చేయటం పోలీసులు కొట్టలేదంటూ అప్పట్లో వైద్యులు నివేదిక ఇవ్వడం సంచలన రేపాయి. ఇప్పుడు అదే కేసును తిరిగి తోడుతూ ఏకంగా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు చేయటం ఇది న్యాయ పరిధిలో ఎంతవరకు నిలబడుతుంది? అనేది చర్చనీయాంశంగా మారింది.
నిజానికి విధానపరమైన నిర్ణయాలు లేదా కేసుల విషయంలో ముఖ్యమంత్రులపై ఇప్పటివరకు దేశంలో ఎక్కడా ఇలాంటి కేసు నమోదు కాలేదు. పైగా హత్యయత్నం అనే ఆరోపిస్తూ రఘురామకృష్ణ చేసిన ఆరోపణ కూడా సమంజసంగా లేదని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా తనకు ఉన్నటువంటి సమాచారం తనకు వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా వ్యక్తులపై లేదా నాయకులపై కేసులు నమోదు చేయడం పరిపాటి, ఇలాగే రఘురామకృష్ణపై కూడా కేసు నమోదు అయింది. పైగా ఇది అప్పట్లో న్యాయస్థానాలు పరిశీలించాయి. ఎక్కడ రఘురాం కృష్ణంరాజుకు ఆ సమయంలో ఊరట లభించలేదు.
దీనిని బట్టి ప్రస్తుతం రఘురామకృష్ణ రాజు పెట్టుకున్న పిటిషన్ లేదా కేసు ఏ మేరకు న్యాయవ్యవస్థలో నిలబడుతుంది అనేది చూడాలి. ఏదేమైనా ఇలాంటి కేసులు దేశంలో ఇదే మొదటిసారి కావడం మాజీ ముఖ్యమంత్రి పై హత్యాయత్నం కేసు నమోదు కావడం అనేది మాత్రం సంచలనం. ఇది గనక ఉద్దేశ పూర్వకంగా పెట్టి, రేపు కోర్టులకు వెళితే ప్రస్తుత ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో పాటు పోలీసు వ్యవస్థ కూడామచ్చ ఏర్పడే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో కూడా పోలీసు వ్యవస్థ ఇబ్బందులు పాలైంది. ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారని హైకోర్టు అనేక సందర్భాల్లో రాష్ట్ర డిజిపి లను హెచ్చరించింది.
ఇప్పుడు రఘురామకృష్ణరాజు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నుంచి ఇబ్బందులు తప్పే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం ఒకంత జాగ్రత్తగా న్యాయ వ్యవస్థ సలహాలు తీసుకుని వెళ్తే మంచిదనే సూచనలు వినిపిస్తున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.