మోడీని లక్ష కోట్లు కోరిన చంద్రబాబు.. వెలుగులోకి సంచలన నివేదిక!
ఏపీలో నూతనంగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంపైనే ఎక్కువగా ఆధారపడింది.
ఏపీలో నూతనంగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంపైనే ఎక్కువగా ఆధారపడింది. కేంద్రంలోనూ కూటమి ఏర్పడిన దరిమిలా.. ఏపీలో ఉన్న టీడీపీ-జనసేనల అవసరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి తగినన్ని ఎక్కువ నిధులు తీసుకువచ్చి.. ఏపీ ఉన్న పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చేందుకు కూటమి సర్కారు సీఎం చంద్రబాబు నిర్ణయిం చుకున్నారు. తాజాగా రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించారు. కేంద్రం పెద్దలను కూడా కలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో భేటీ అయి.. ఏపీ పరిస్థితిని వివరించారు.
ఈ నేపథ్యంలో ఈ నెలలో ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి విరివిగా సొమ్ములు కేటాయించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారన్నది అందరికీ తెలిసిందే. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చేందుకు తన 16 మంది ఎంపీలతోనూ మద్దతిస్తున్న నేపథ్యంలో మోడీకి కూడా చంద్రబాబు కోరికలను తీర్చాల్సిన అవసరం ఏర్పడింది. అయితే.. మోడీ సర్కారును చంద్రబాబు ఎంత మేరకు నిధులు కోరారు? ఏయే ప్రాజెక్టులకు ఆయన సొమ్ములు ఇవ్వమని అడిగారు? అనే విషయాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి. వీటిపై ఇప్పటి వరకు చంద్రబాబు కానీ, మోడీ సర్కారు కానీ నోరు విప్పలేదు.
అయితే.. తాజాగా బ్లూంబర్గ్ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ఏయే రాష్ట్రాలకు కేంద్రం ఎంతెంత సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది? ఆయా రాష్ట్రాలు ఎంతెంత సొమ్మును ఆశించాయి? అనే విషయాలను ఈ నివేదిక స్పష్టం చేసింది. దీని ప్రకారం చంద్రబాబు సర్కారు.. కేంద్రాన్ని వచ్చేఐదేళ్లలో రూ.లక్ష కోట్ల మేరకు సాయం చేయాలని కోరినట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. దీనిలో పోలవరం, అమరావతి ప్రాజెక్టులను కూడా జత చేసిందని తెలిపింది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ప్రత్యేకంగా గ్రాంట్లు ఇవ్వాలని కోరినట్టు నివేదిక తెలిపింది. అదే విధంగా రుణ సమీకరణ పరిమితి పెంచాలని కోరినట్లు పేర్కొంది.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, దీంతో పాటుగా విజయవాడ, విశాఖపట్నం, అమరావతిలో మెట్రో ప్రాజెక్టులు, లైట్ రైల్ ప్రాజెక్ట్ కోసం నిధులు కూడా కేంద్రమే ఇవ్వాలని చంద్రబాబు కోరినట్టు ఈ నివేదిక వెల్లడించింది. అలానే 2014-19 మధ్య కాలంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులను ఇచ్చినట్టుగానే.. ఇప్పుడు కూడా వచ్చే ఐదేళ్లపాటు.. వెనుక బడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని కోరినట్టు నివేదిక పేర్కొంది. మొత్తంగా మోడీ సర్కారును రూ.లక్ష కోట్ల రూపాయల సాయం కోరారని తెలిపింది. అయితే.. ఇదే తరహా డిమాండ్ బిహార్ నుంచి వ్యక్తమైనట్టు నివేదిక వెల్లడించింది. దీంతో మోడీ సర్కారు ఏమేరకు ఏపీకి వరాలు ప్రకటిస్తారనేది వచ్చే బడ్జెట్‌లో చూడాలని పేర్కొంది.