మోడీ నామినేషన్ కి చంద్రబాబు !
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి పిలుపు వచ్చింది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఈ నెల 13న ఏపీలో పోలింగ్ ముగిసిన వెంటనే 14న వారణాసి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 14న వారాణాసి లోక్ సభకు బీజేపీ తరఫున అభ్యర్ధిగా ప్రధాని నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈ కీలక సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్డీయే భాగస్వాములు అందరికీ మోడీ వారణాసిని పిలిపించుకుంటున్నారు. అందరితో కలసి ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. మోడీ ముచ్చటగా మూడోసారి వారణాసి నుంచి బీజేపీ తరఫున అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు.
ఆయన 2014లో తొలిసారి ఎంపీగా పోటీ చేశారు. అపుడే జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన మోడీ గుజరాత్ లోని వడోదరా లోక్ సభ స్థానం నుంచి కూడా రెండవ సీటుగా ఎంచుకుని పోటీ చేశారు. వారణాసిలో 371,784 మెజారిటీ వచ్చింది. వడోదరాలో 570,128 మెజారిటీ వచ్చింది. అయినా మోడీ వారణాసిని ఉంచుకుని వడోదరాను వదిలేశారు. ఇక 2019లో మోడీకి వారణాసిలో 479,505 మెజారిటీ దక్కింది.
ఈసారి కూడా అక్కడ నుంచే పోటీకి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా అట్టహాసంలొగా మోడీ నామినేషన్ ఘట్టం సాగనుంది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి చంద్రబాబుని ఆహ్వానించారు. దీంతో ఈ నెల 14న చంద్రబాబు వారణాసికి బయలుదేరి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమం అనంతరం అదే రోజున వారణాసిలో ఎన్‍డీఏ కీలకసమావేశం జరగనుందని తెలుస్తోంది. . ఈ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఒక రోజు పర్యటన నిమిత్తం మే 14న ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం నుంచి వారాణాసికి చంద్రబాబు బయలుదేరి వెళతారని తిరిగి అదే రోజు రాత్రికి విజయవాడకు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.