ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం!

అలాంటి వాటికి చెక్ చెప్పేలా కేంద్రం తాజాగా కీలక నిర్ణయాలు తీసుకొని.. లక్షలాది మందికి ఊరట కలిగించేలా చర్యలు తీసుకుంది.

Update: 2025-01-19 04:28 GMT

కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతకు అర్థం కాని నిబంధనలతో చుక్కలు చూపించే ఈపీఎఫ్ వర్రీలకు తాజాగా కీలక నిర్ణయాల్ని తీసుకుంది. దీంతో.. ఐటీ ఉద్యోగులతో పాటు పలు ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఎంప్లాయిస్ ఎదుర్కొనే పీఎఫ్ అకౌంట్ కష్టాలకు పరిష్కారాల్ని ఇచ్చేసింది. ఇంతవరకు ఈపీఎఫ్ వోలో పేరు.. పుట్టిన తేదీ లాంటి వివరాల్ని మార్చుకోవటం ఒక పెద్ద సవాలుగా మారటమే కాదు.. పలువురు తమకు వచ్చిన ఉద్యోగాల్ని సైతం కోల్పోయిన దారుణ పరిస్థితి. అలాంటి వాటికి చెక్ చెప్పేలా కేంద్రం తాజాగా కీలక నిర్ణయాలు తీసుకొని.. లక్షలాది మందికి ఊరట కలిగించేలా చర్యలు తీసుకుంది.

ఇకపై కంపెనీ యజమాని (ఎంప్లాయర్).. ఈపీఎఫ్ ఓ ఆమోదం అవసరం లేకుండా ఆన్ లైన్ లోనే సులువుగా మార్చుకునే వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇ-కేవైసీ పూర్తి చేసిన ఈపీఎఫ్ ఖాతాలను యజమాని జోక్యం లేకుండానే బదిలీ చేసుకునే మరో సదుపాయాన్నిఅందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర కార్మిక శాఖా మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఈ రెండు సేవల్ని శనివారం ప్రారంభించారు. దీంతో ఈపీఎఫ్ ఓ ప్రక్రియ సులభతరం కావటమే కాదు.. యజమానులపై పని ఒత్తిడి తగ్గనుంది.

ఇంతకూ ఈపీఎఫ్ ఓ ఖాతాల్లో సాధారణంగా ఎదుర్కొనే సమస్యల విషయానికి వస్తే.. ఈపీఎఫ్ ఓ చందాదారులకు సంబంధించి వ్యక్తిగత వివరాలైన పేరు.. పుట్టిన తేదీ.. లింగ నిర్దారణ.. జాతీయత.. తల్లి.. తండ్రి పేరు.. వైవాహిక స్థితి.. జీవిత భాగస్వామి పేరు.. ఉద్యోగంలో చేరిన తేదీ.. ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తేదీ లాంటి వివరాల్ని నమోదు చేసే విషయంలో తప్పులు దొర్లుతుంటాయి. సాధారణంగా జరిగే ఈ పొరపాట్లను ఇప్పటివరకు భూతద్దంలో చూసినట్లుగా చూస్తే.. ఉద్యోగులకు చుక్కలు చూపించేది ఈపీఎఫ్ ఓ. ఈ పొరపాట్లను మార్చుకోవటానికి నెలల తరబడి పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.

ఇప్పటివరకు ఉన్న విధానంలో తప్పులు దొర్లిన సందర్భంలో వీటిని కరెక్షన్లు సరి చేయటానికి ఉద్యోగులు ఆన్ లైన్ లో సంబంధిత డాక్యుమెంట్లతో రిక్వెస్టు పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి యజమాని వెరిఫై చేసిన తర్వాత రిక్వెస్ట్ ఈపీఎఫ్ ఓ ఆమోదం కోసం పంపుతున్నారు. ఈ ప్రక్రియను జాయింట్ డిక్లరేషన్ గా పేర్కొంటారు. ఇలాంటివి 2024-25 ఒక్క ఏడాదిలో 8 లక్షల వినతులు వచ్చాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇందులోని 45 శాతం వినతుల విషయంలో తక్షణం ఊరట లభిస్తుందని.. మరో 50 శాతం కరెక్షన్లు యజమాని దగ్గర పరిష్కారం కానున్నట్లుగా పేర్కొన్నారు. కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రకారం.. 2017 అక్టోబరు 1 తర్వాత జారీ అయిన యూఏఎన్ చందాదారులు ఈ కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. తమ వివరాల్ని మార్చుకునేందుకు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ల అవసరం ఉండదు. 2017 అక్టోబరు ఒకటి కంటే ముందు జారీ అయిన యూఏఎన్ చందాదారుల విషయంలో ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేకుండానే యాజమాన్యమే అవసరమైన మార్పులు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

అంతేకాదు.. ఇందుకు అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్లను సైతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి స్వయంగా వెల్లడించారు. ఆధార్ తో లింకు చేయని యూఏఎన్ ఖాతాల విషయంలో ఏవైనా మార్పులు చేయాల్సిన సందర్భంలో మాత్రం యజమానికి ఫిజికల్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. వారి వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ఈపీఎఫ్ ఓ ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఎవరైనా ఉద్యోగుల అభ్యర్థనలు యజమాని వద్ద పెండింగ్ లో ఉంటే.. వాటిని డిలీట్ చేసి కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. అంతేకాదు.. ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ ఓ అకౌంట్ ను సులువుగా బదిలీ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇ-కేవైసీ పూర్తి చేసిన చందాదారులు ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి యజమాని జోక్యం లేకుండానే ట్రాన్సఫర్ చేసుకోవచ్చని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

ఎవరైనా ట్రాన్సఫర్ రిక్వెస్టు ప్రస్తుతం ఎంప్లాయిర్ వద్ద పెండింగ్ లో ఉంటే.. డిలీట్ చేసి నేరుగా ఈపీఎఫ్ ఓకు రిక్వెస్టు పెట్టుకోవచ్చని.. ఉద్యోగం మారిన సందర్భంలో ఈపీఎఫ్ అకౌంట్ బదిలీ అభ్యర్థనలు ఈపీఎఫ్ కు చేరటానికి సగటున 12-13 రోజులు పడుతుందని.. తాజా నిర్ణయంతో గడువు తగ్గుతుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థతో సమానంగా ఈపీఎఫ్ సేవల్ని అందించటమే లక్ష్యంగా అనేక చర్యల్ని తీసుకుంటున్నట్లుగా చెప్పిన వివరాలు లక్షలాది మంది గుండెల మీద భారాన్ని తగ్గించేలా చేస్తాయని చెబుతున్నారు.

Tags:    

Similar News