బాబుగారూ.. పట్టించుకోకుంటే.. పెద్ద 'షాకే'.. !
తప్పు ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు.. ఆ తప్పులు కొనసాగకుండా చూడడమే ముఖ్యం.
తప్పు ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు.. ఆ తప్పులు కొనసాగకుండా చూడడమే ముఖ్యం. ఈ విషయం లో చంద్రబాబు ఇప్పుడు తప్పించుకున్నా.. మున్ముందు మాత్రం ఆయనకు రాజకీయంగా షాకేనని అంటున్నారు పరిశీలకులు. ``సీఎం సార్ నెల నెలా 1వ తేదీనే పింఛను దారుల ఇళ్లకు వస్తున్నారు. వారికి పించను అందిస్తున్నారు. అదేవిధంగా ప్రతినెలా 5-8 తేదీల మధ్య కూడా.. ప్రజల ఇళ్లకు రావాలి. అప్పుడు ఆయనకు మా బాధలు తెలుస్తాయి`` అని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎస్సీ కాలని ప్రజలు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
ఇదేమీ ప్రతిపక్షాలు చేసిన కుట్ర కాదు. టీడీపీని బాగా సమర్థించే ఓ పెద్ద మీడియా చేసిన సర్వేలో తేలిన నిజం. విషయంలోకి వస్తే.. వైసీపీ హయాంలో విద్యుత్ చార్జీలను పెంచారని.. ఒప్పందాలు చేసుకుని.. రాష్ట్ర ప్రజలపై కోట్ల రూపాయల భారం మోపారని.. ఎన్నికల సమయంలో చంద్రబాబు సహా కూటమి నాయకులు ప్రచారం చేశారు. అంతేకాదు.. తాము వస్తే.. బాదుడు ఉండదని కూడా చెప్పారు. కానీ.. గత రెండు మాసాలుగా విద్యుత్ చార్జీలు పెరుగుతూనే ఉన్నాయి.
ట్రూ అప్ చార్జీలని, ఈపీపీసీఏ చార్జీలని, కస్టమర్ చార్జీలని ఇలా.. ఏదో ఒక పేరు పెట్టి.. వాయించేస్తున్నా రు. దీంతో వాడుకున్న కరెంటు 100 అయితే.. ఇతర చార్జీలు మరో 120 దాకా ఉంటున్నాయి. దీంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇదేంవిద్యుత్ చార్జీలంటూ.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సబ్సిడీ విద్యుత్‌ను కూడా ఎత్తేశారని.. ఆయా వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీంతో తాజాగా తూర్పుగోదావరిజిల్లాలోని ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన చేశారు.
అయితే.. సర్కారు తరఫున మాత్రం.. ఇవన్నీ మేం చేసిన తప్పులు కాదని.. వైసీపీ సర్కారు చేసిన అప్పులు.. తప్పులు కారణంగానే ఇప్పుడు భారాలు పడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. అయితే.. ప్రజలు మాత్రం వారు తప్పులు చేయబట్టే.. మీకు అధికారం ఇచ్చామని అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా అవే తప్పులు చేస్తూ.. పోతే.. తమకు ఒరిగిందేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలపై చంద్రబాబు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే.. బలమైన ప్రజా పక్షం ఆయనకు దూరమయ్యే ప్రమాదం కూడా ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.