అప్పుడే నా జన్మ ధన్యం: చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''అప్పుడే నా జన్మ ధన్యం' అని చెప్పారు.;

ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''అప్పుడే నా జన్మ ధన్యం' అని చెప్పారు. తాజాగా ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. తాను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. అయితే.. ఎప్పటికప్పుడు తనకు కొత్తగానే ఉంటున్నాయని అంటున్నారు. దీనికి కారణం.. తాను ఎప్పుడూ ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతుండడమేనన్నారు.
గతంలో ఐటీని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగామని చంద్రబాబు చెప్పారు. ఇది ఇప్పుడు అనేక మందికి ఉపాధి కల్పిస్తోందని.. తెలుగువారు.. ఎక్కడున్నా.. ఐటీ రంగంలో ముందుకు సాగుతున్నారని చెప్పారు. అప్పటి కల సాకారం అయిందన్నారు. అయితే.. ఇప్పుడు అంతకుమించిన లక్ష్యాన్ని తాను నిర్దేశించుకున్నట్టు చంద్రబాబు తెలిపారు. అదే పేదలను ఉన్నతస్థాయికి తీసుకురావడమని చెప్పారు. ఈ కల సాకారం అయితే.. తన జీవితం ధన్యం అయినట్టేనని చంద్రబాబు తెలిపారు.
పేదలను ఉన్నతస్థాయికి తీసుకురావడం ప్రతి ఒక్క ఉన్నతస్థాయి కుటుంబాల బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీమంతుడు సినిమాలోని ఓ డైలాగును చంద్రబాబు ప్రస్తావించారు. జన్మ భూమికి ఏదో ఒక చేయండి లేకపోతే లావైపోతారు! అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క ప్రవాసులే కాకుండా.. దేశంలోనూ.. రాష్ట్రంలోనూ.. ఉన్నతస్థాయిలో ఉన్నవారు..పేదలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. పేదరికాన్ని తగ్గించగలిగినప్పుడే.. తన జీవితం ధన్యమని చంద్రబాబు చెప్పారు.