టీడీపీతో మెగానుబంధం మరింత స్ట్రాంగ్ గా !?
ఇపుడు పవన్ కి తోడుగా మెగాస్టార్ చిరంజీవిని తన వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.
ఏపీలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాజకీయాలు చేస్తోంది. కేవలం ఈ రోజుకు మాత్రమే అని కాకుండా రానున్న కాలాలలో కూడా పసుపు పార్టీ పరిమళాలు అందుకునేలా అధినాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
ఇక తెలుగుదేశం పార్టీ 2024లో తన మొత్తం రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ చేయని ఒక పదునైన వ్యూహాన్ని రచించింది. ఏపీలో బీసీలు టీడీపీకి మొదటి నుంచి పెట్టని కోట. అయితే ఏపీ రాజకీయాల్లో కీలకమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులు మాత్రం ప్రతీ ఎన్నికకూ ఒక చాయిస్ ని తీసుకుంటూ ఉంటారు.
ఒకసారి వారు టీడీపీని మరోసారి వైసీపీని గెలిపిస్తూ ఉంటారు. గతంలో చూస్తే కాపులు కాంగ్రెస్ కి కట్టుబడిపోయిన అతి పెద్ద ఓటు బ్యాంక్ గా ఉండేవారు. కానీ కాంగ్రెస్ విభజన ఏపీలో లేకుండా పోవడం ప్రాంతీయ పార్టీగా వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ వైపు కాంగ్రెస్ ని చూసినంతగా కాపులు చూడకపోవడం వల్ల టీడీపీ పంట పండుతోంది.
ఏపీలో 2024 ఫలితాల తరువాత చూస్తే కమ్మలు కాపులు బీసీలు, ఇతర వర్గాల మద్దతు టీడీపీ కూటమిని గణనీయంగా దక్కింది అని చెప్పాల్సి ఉంది. అంతే కాదు అనూహ్యంగా ఎస్టీ ఎస్టీ సెగ్మెంట్లలోనూ టీడీపీ తన పెర్ఫార్మెన్స్ బాగా చూపించింది. మైనారిటీల అభిమానాన్ని కూడా ఈసారి ఎన్నికల్లో టీడీపీ ఎక్కువగా పొందింది. ఇక రెడ్లు కూడా చాలా కాలం తరువాత ఒక గుర్తించతగిన శాతం మేరకు టీడీపీని సపోర్ట్ చేయడం ఇంకో ముఖ్య పరిణమంగా చెబుతున్నారు
ఇదంతా రాజకీయ సామాజిక పోలరైజేషన్ వల్ల సాధ్యపడింది. టీడీపీనే ఏపీకి ఆశా కిరణం అన్న లెక్కలతో కూడా సామాజిక బౌండరీలను దాటి మరీ 2024 ఎన్నికల్లో అనేక సామాజిక వర్గాలు మద్దతు ఇచ్చాయి. ఏపీ ఫస్ట్ పాలిటిక్స్ నెక్స్ట్ అన్న స్లోగన్ కూడా చాలా మందిని టీడీపీ వైపు నడిపించింది.
అయితే ఇదే పరిస్థితి ఎల్లకాలం ఉండకపోవచ్చు. రాజకీయాల్లో అనేక డైమన్షన్లు ఉంటాయి. అవే గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. పైగా నిన్న ఉన్నట్లుగా నేడు ఉండే చాన్స్ లేదు. దాంతో టీడీపీ అధినాయకత్వం ఇపుడు కొత్త ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు.
కూటమిలో బీజేపీ జనసేన ఉంది. ఆ పొత్తును దీర్ఘ కాలం కొనసాగించాలని చూస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ వంటి చరిష్మాటిక్ లీడర్ కూటమి వైపు ఉండడం పెద్ద ప్లస్ పాయింట్. పవన్ కూటమిలో ఉన్నంతవరకూ కూటమిని టచ్ చేసే సాహసం ప్రతిపక్షాలు చేయలేవు.
ఇపుడు పవన్ కి తోడుగా మెగాస్టార్ చిరంజీవిని తన వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయానికి మెగాస్టార్ పరోక్షంగా సహకరించారు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏపీ ప్రజల మీద పెను ప్రభావం చూపించాయి. టోటల్ మెగా కాంపౌండ్ అంతా టీడీపీ కూటమి విజయం కోసం పనిచేసింది అని కూడా చెప్పుకున్నారు.
ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబుని మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి ఆయన ఇంట్లో కలిసారు. కోటి రూపాయల చెక్కుని వరదబాధితులకు సహాయార్ధం అందించాలని ఆయన వచ్చినప్పటికీ ఇద్దరూ అనేక ఇతర విషయాలని కూడా చర్చించుకున్నారు అని ప్రచారంలో ఉంది.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని చిరంజీవి ముందు ఒక కీలక ప్రతిపాదనను చంద్రబాబు పెట్టినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. మెగా ఇమేజ్ కలిగిన చిరంజీవికి కోట్లాదిమంది ఆరాధకులు ఉన్నారు. ఆయన నోటి వెంట మాట ఏది వచ్చినా అది శిరోధార్యం గా భావించే వారు ఉన్నారు.
దాంతో మెగాస్టార్ సేవలను ప్రభుత్వం ఈ విధంగా వాడుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. మెగాస్టార్ హోదాకు తగిన విధంగా కేబినెట్ ర్యాంక్ కల్పిస్తూ ఆయనకు కీలకమైన పదవిని ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
టాలీవుడ్ కి పెద్దగా కూడా చిరంజీవి ఉన్నారు. అజాత శత్రువుగా ఆయన ఉన్నారు. ఆయన ద్వారా ఏపీలో సినీ పరిశ్రమను విస్తరించాలని కూడా ప్రభుత్వానికి ఆలోచనలు ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రిగా పనిచేసిన మెగాస్టార్ ఇపుడు అయితే రాజకీయాలను పక్కన పెట్టినట్లుగానే చెబుతారు.
అయితే చంద్రబాబు ప్రతిపాదించినట్లుగా జరుగుతున్న ప్రచారం మీద మెగాస్టార్ ఏ నిర్ణయం తీసుకుంటారో అని కూడా అంటున్నారు. అదే కనుక జరిగితే టీడీపీతో మెగానుబంధం మరింతగా గట్టి పడుతుంది అని అంటున్నారు. ఇలా దీర్ఘకాలం మెగానుబంధం స్ట్రాంగ్ గా చేసుకుంటే టీడీపీకి పొలిటికల్ గా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని కూడా ఆ పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తలలో నిజమెంత ఉందో. రేపటి పరిణామాలు ఎలా ఉంటాయో.