మారిన చంద్రబాబు.. అంత బిజీలోనూ జీవిత భాగస్వామి కోసం షాపింగ్
అవును.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మారిపోయారు. అది కూడా అలా ఇలా కాదు.. పూర్తిగా మారిపోయారు.;

అవును.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మారిపోయారు. అది కూడా అలా ఇలా కాదు.. పూర్తిగా మారిపోయారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు. కానీ.. గతానికి భిన్నంగా ఈసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన తీరు గతానికి భిన్నంగా ఉంటుంది. ఎక్కడిదాకానో ఎందుకు? 2014లో అధికారంలో ఉన్న వేళలో విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో కావొచ్చు.. ఇతర సమయాల్లోనూ ఇంటి కోసం.. ఇంట్లో వారి కోసం ఎలాంటి షాపింగ్ చేసేవారు కాదు చంద్రబాబు.
అందుకు భిన్నంగా ఈ టర్మ్ లో మాత్రం ఆయన.. ఏ మాత్రం అవకాశం లభించినా.. జీవిత భాగస్వామి కోసం షాపింగ్ చేస్తున్న వైనాలు ఎక్కువ అవుతున్నాయి. తన రాజకీయ జీవితంలో గతంలో ఎప్పుడూ చూడనంత సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయ్యాక తన గతాన్ని మర్చిపోనట్లుగా ఉంది. అందుకే కాబోలు.. తనకు అవకాశం లభించిన ప్రతిసారీ.. కుటుంబం.. కుటుంబ సభ్యులకు సంబంధించి తాను ఎంత ఆలోచిస్తున్నాన్న విషయాన్ని తన చేతలతో చెప్పకనే చెప్పేస్తున్నారు.
తాజాగా బాపట్ల పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. జిల్లాలోని కొత్తగొల్లపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజావేదిక సమీపంలో డ్వాక్రా మహిళల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన్ను చీరాల పట్టుచీరలు ఆకర్షించాయి. తన జీవిత భాగస్వామి భువనేశ్వరి కోసం జాండ్రపేటకుచెందిన చేనేత కార్మికురాలు.. పొదుపు సంఘం సభ్యురాలు చింతం మయూరి షాపులో ఒక పట్టుచీరను కొనుగోలు చేశారు.
జీవిత భాగస్వామి కోసం చీర కొన్న చంద్రబాబు.. అందుకు రూ.12 వేల మొత్తాన్ని చెల్లించటం గమనార్హం. అంతేకాదు.. సదరు వ్యాపార మహిళను అభినందిస్తూ.. బాగా వ్యాపారం చేయాలని.. నెలకు రూ.40 నుంచి రూ.50 వేల వరకు సంపాదించాలన్న సూచన చేశారు. గతంలో ఇదే చంద్రబాబు తాను విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంగా తన మనమడి కోసం షాపింగ్ చేయటానికి సైతం టైం సరిపోలేదని.. ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చిందని చెప్పేవారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా.. ఏ చిన్న అవకాశం లభించినా ఇంట్లో వారికి ఏమైనా కొనాలనే ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటివే చెప్పేస్తాయి.. చంద్రబాబు ఎంత మారారో అన్న మాట క్యాడర్ మాటల్లో ప్రత్యేకంగా వినిపిస్తోంది.