బాబు ఢిల్లీ టూర్ తరువాత ఏపీకి గుడ్ న్యూస్

దశాబ్దాలుగా ఊరిస్తూ వస్తున్న విశాఖ రైల్వే జోన్ పట్టాలెక్కించేందుకు కేంద్ర రైల్వే మంత్రి పచ్చ జెండా ఊపేశారు. ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు కూడా.

Update: 2024-08-19 16:34 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ మంచి ఫలితాన్ని ఇచ్చిందని చెప్పాలి. తాజాగా చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని ఏపీ అభివృద్ధి విషయంలో కీలక చర్చలు జరిపారు. ఏపీ కోసం ఏం చేయాలో కూడా వారికి వివరించారు. సత్వరమే ఏపీకి అన్ని విధాలుగా సాయం చేయాలని కోరి వచ్చారు.

అలా ఢిల్లీ టూర్ ముగించుకుని చంద్రబాబు ఇలా ఏపీకి తిరిగి వచ్చారో లేదో కానీ వెనువెంటనే ఒక శుభ వార్త అయితే వెలువడింది. దశాబ్దాలుగా ఊరిస్తూ వస్తున్న విశాఖ రైల్వే జోన్ పట్టాలెక్కించేందుకు కేంద్ర రైల్వే మంత్రి పచ్చ జెండా ఊపేశారు. ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు కూడా.

అతి తొందరలోనే విశాఖలో రైల్వే జోన్ ని ఏర్పాటు చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే జోన్ కి ఇప్పటిదాకా ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయాయని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రజల ఆకాంక్షలు అతి త్వరలోనే నెరవేరబోతున్నాయని కూడా వెల్లడించారు.

ఏపీలో రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉందని ఆయన చెప్పారు. రైల్వే జోన్ నిర్మాణం పనులు వేగంగానే మొదలెడతామని ఆయన తెలిపారు . దానికి అవసరమైన అన్ని రకాల సన్నాహాలతో కేంద్రం సిద్ధంగా ఉంటుందని కూడా చెప్పేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని వెల్లడించారు. అంతే కాదు రైల్వే జోన్ ఏర్పాటుకు భూ కేటాయింపులు ఇతర అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిందని ఆయన చెప్పడం విశేషం. మొత్తానికి తొందరలోనే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు అవుతుందని కేంద్ర మంత్రి చెప్పడం మాత్రం కచ్చితంగా శుభవార్తే.

ఇకపోతే విశాఖ రైల్వే జోన్ కలకు అర్ధ శతాబ్దం వయసు ఉంది. 1970 ప్రాంతాలలో ఆనాటి విశాఖ ఎంపీ తెన్నేటి విశ్వనాధం తొలుత ఈ డిమాండ్ చేశారు. ఆనాటి నుంచి జనంలోనూ ప్రాజా సంఘాలలోనూ ఈ డిమాండ్ నలుగుతోంది. ఇక 1990 దశకం తరువాత కేంద్రం దేశంలో అనేక రైల్వే జోన్లను మంజూరు చేసినపుడు కూడా విశాఖ రైల్వే జోన్ ఆశలు చిగురించాయి.

అయితే అప్పటి నుంచి ప్రత్యక్ష పోరాటాలు రైల్వే జోన్ కోసం సాగినా కూడా కేంద్రం వద్ద మాత్రం స్పందన లేదు. అయితే 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం విభజన హామీలలో రైల్వే జోన్ ఉండడంతో ఇక జోన్ ఖాయమని అనుకున్నారు. దానికి తగినట్లుగా 2019లో కేంద్రం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది కూడా.

కానీ అది కూడా గడచిన అయిదేళ్ల కాలంలో ఏమాత్రం సాకారం కాలేదు. మొత్తానికి ఇన్నేళ్ల తరువాత కేంద్రం సరిగ్గా స్పందించడం రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా ఈ విషయంలో చొరవ తీసుకోవడంతో విశాఖ రైల్వే జోన్ అన్న కల అయితే నెరవేరబోతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News