చంద్రబాబు వద్దే ఈ కీలక శాఖలు... కారణం ఇదే!

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. గురువారం బాధ్యతలు స్వీకరించారు

Update: 2024-06-14 11:59 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయంలో శుక్రవారం మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ సందర్భంగా కొన్ని శాఖల విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

అవును... కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ తన కేబినెట్ లోని మంత్రులకు శాఖలు కేటాయించారు చంద్రబాబు. ఇందులో భాగంగా పవన్ కి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించగా... నారాయణ, లోకేష్ లకు పాతశాఖలే కేటాయించారు. వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖను కేటాయించారు.

ఈ సందర్భంగా కీలకమైన కొన్ని శాఖలు చంద్రబాబు తనవద్దే పెట్టుకోవడం ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇందులో భాగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్డీ) శాఖను బాబు తనవద్దే పెట్టుకున్నారు. గతంలోనూ ఈ సాధారణ పరిపాలన శాఖను తనవద్దే పెట్టుకున్నారు. ఈ శాఖ అత్యంత కీలకమైనది. ఈ విషయాన్ని బాబు బలంగా నమ్ముతారని అంటారు!

ఇందులో భాగంగా... మంత్రులు, నేతలు, అధికారులను అదుపులోకి ఉంచేందుకు ఈ సాధారణ పరిపాలన శాఖ ఉపయోగపడుతుందని.. అందుకే దీన్ని చంద్రబాబు తనవద్దే ఉంచుకున్నారని అంటున్నారు. ఇదే సమయంలో హోంశాఖను వంగలపూడి అనితకు కేటాయించినా... అందులోని లా అండ్ ఆర్డర్ (శాంతి భద్రతలు) ను మాత్రం బాబు తనవద్దే ఉంచుకున్నారు.

ప్రధానంగా పోలీసు యంత్రాంగాన్ని నియంత్రించడంలో ఈ విభాగం కీలకం అని చెబుతారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖ ఇచ్చినా... శాంతి భద్రతలను మాత్రం తనవద్దే పెట్టుకున్నారు! అదేవిధంగా గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ కూడా మహిళా మంత్రికే హోంశాఖ ఇచ్చినప్పటికీ... శాంతిభద్రతలను తనవద్దే ఉంచుకున్నారు.

ఈ సమయంలో చంద్రబాబు కూడా ఈ విషయంలో అదే ఆలోచన చేశారు! దీనివల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ఏమి జరుగుతుందనే విషయంపై పూర్తి పట్టు ఉంటుందని అంటారు. దీంతో... చంద్రబాబు కొన్ని కీలక శాఖలను తనవద్దే ఉంచుకునే విషయంలో సహేతుకమైన నిర్ణయాలే తీసుకున్నారని అంటున్నారు!

Tags:    

Similar News