కొత్త బాబు.. మోడీషాలకు పూర్తిగా సరెండర్!
అమిత్ షాతో భేటీ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో కలవకుండా తిరిగి వచ్చేయటంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది
అవసరం లేకున్నా కొన్నిసార్లు సంబంధాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈసారి చేతికి అధికారం రాకుంటే ఇంకెప్పటికి ఆ అవకాశం దక్కదన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఏం చేసైనా సరే.. ఈసారి ఎన్నికల్లో గెలుపు బాట పట్టాలన్న పట్టుదల ఆయనలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇందుకోసం తనను తాను మార్చుకోవటానికి సైతం సిద్ధమవుతున్నారు.
గతంలో మాదిరి కాకుండా కొత్త బాబును ఆవిష్కరిస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి.. ప్రధాని మోడీ నీడగా అభివర్ణించే అమిత్ షాతో భేటీ కావటం తెలిసిందే. సాధారణంగా అమిత్ షాతో కలిసిన ముఖ్యులు.. ఆ తర్వాత మోడీతో భేటీ కావటం మామూలే. కానీ.. చంద్రబాబు విషయంలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ కనిపించింది.
అమిత్ షాతో భేటీ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో కలవకుండా తిరిగి వచ్చేయటంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. నిజానికి చంద్రబాబుతో బంధం కుదుర్చుకోవటం ప్రధాని మోడీకి సుతారం ఇష్టం లేదని చెబుతున్నారు. అయితే.. అమిత్ షా ప్రత్యేక ఆసక్తిని కనబర్చటంతో మోడీ కాదనలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. వ్యూహాత్మకంగా దక్షిణాదిలో బీజేపీ బలం పెంచుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని విడవకుండా మరింత లోతుల్లోకి వెళ్లటమే అమిత్ షా ఆలోచనగా చెబుతున్నారు.
ఈసారి ఎన్నికల్లో 2014 నాటి కాంబినేషన్ రిపీట్ చేయటం ద్వారా.. ఐదు నుంచి పది స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలన్నది అమిత్ షా ఆలోచనగా చెబుతున్నారు. అదే జరిగితే.. బీజేపీకి ఏపీలో గౌరవప్రదమైన ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు చాలా అవసరమని.. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయటానికి అవసరమైన అండ దొరుకుతుందన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు పరిస్థితి గతంలో మాదిరి లేదు. ఏదోలా అధికారంలోకి వచ్చేయాలన్న తపన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది.
అందుకు కేంద్రంలోని మోడీ సర్కారు అండ అవసరమని ఆయన భావిస్తున్నారు. 2019లో జరిగిన తప్పుల్ని రిపీట్ చేయకూడదని బలంగా భావిస్తున్న ఆయన.. అందుకు తగ్గట్లే తన స్వరంలోనూ మార్పును ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్య చేశారని చెబుతున్నారు. ''మీరేం చెబితే అది చేస్తాం. గతంలో జరిగిన వాటిని వదిలేద్దాం. ఆ తప్పుల్ని భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. పొత్తుకు సహకరించండి. సీట్ల లెక్కలో మీ అభిప్రాయానికి విలువ ఇస్తాం'' అని పదే పదే చెప్పినట్లుగా తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మోడీ సర్కారు చెప్పినట్లే తాము నడుస్తామన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా సమాచారం.
ఈ తరహా చంద్రబాబును చూడటం ఇదే తొలిసారిగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తాయి. గతంలో ఎప్పుడూ కూడా తన ఉనికిని బలంగా చాటుకోవటానికి ఇష్టపడే ఆయన.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం విశేషమని చెప్పక తప్పదు. ఏమైనా బీజేపీతో చెలిమి కోసం ఆయన పడుతున్న తపన సరికొత్తగా ఉందంటున్నారు.