ఆ వంద కోట్లు మాకు అక్కర్లేదు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కుబేరుడు గౌతమ్ అదానీ మీద దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-11-25 10:46 GMT

కుబేరుడు గౌతమ్ అదానీ మీద దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేసేందుకు అమెరికా సిద్ధపడింది. దానిపై వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో అదానీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రూ.100 కోట్ల విరాళాన్ని అందించారు. అయితే.. ఈ విరాళాలు రాష్ట్రానికి తీసుకోవడం లేదని తిరస్కరిస్తున్నట్లుగా రేవంత్ ప్రకటించారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ ఈ విషయాన్ని వెల్లడించారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ప్రభుత్వం కార్పస్ ఫండ్ కింద విరాళాలు సేకరించాలని నిర్ణయించిందని, అదానీ సహా చాలా సంస్థలు విరాళాలు ఇచ్చాయని సీఎం ప్రకటించారు. కానీ.. కొందరు ఆ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అప్పనంగా ఇచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తమ మీద, తమ ప్రభుత్వం మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అందుకే.. అదానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఇచ్చిన రూ.100 కోట్లను తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. తమ ప్రభుత్వ అధికారి జయేశ్ రంజన్ ద్వారా విరాళాలు వాపస్ చేస్తున్నట్లు అదానీ గ్రూప్‌నకు లేఖ రాశారని వెల్లడించారు.

తమ ప్రజాప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి తావు ఇవ్వొద్దని, తాను, తన సహచర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు. విరాళాలతో లక్షలాది మంది యువతకు నైపుణ్యాలను కల్పించాలని అనుకున్నామని, రాజకీయ విమర్శల నేపథ్యంలో విరాళాన్ని రిటర్న్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు అదానీ వ్యవహారంలో బయట జరుగుతున్న పరిణామాలకు తమ ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. కావాలని కొంత మంది తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, అందుకే.. ఆ అంశంతో ముడిపెట్టవద్దనే 100 కోట్లు వద్దన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఏ సంస్థ కూడా ఇంకా రూపాయి నిధులు కూడా జమ చేయలేదని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి అన్ని కాంట్రాక్ట్ సంస్థలకు అవకాశం ఉంటుందని అన్నారు. నిబంధన ప్రకారమే కాంట్రాక్టులు అప్పగించడం జరుగుతుందని తెలిపారు.

మోడీకి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంతో న్యాయబద్ధంగా కొట్లాడుతామని స్పష్టం చేశారు. మరోసారి రేపు ఢిల్లీకి వెళ్తున్నట్లు రేవంత్ చెప్పారు. తాము కేవలం అసెంబ్లీ స్పీకర్ ఇంట్లో పెళ్లికి వెళ్తున్నామని, ఎలాంటి రాజకీయ పర్యటన కాదని పేర్కొన్నారు. అదే సందర్భంలో ఒకవేళ మంత్రులు అందుబాటులో ఉంటే వారిని సైతం కలుస్తామని వెల్లడించారు. తాము మోడీ ముందు మోకారిళ్లడానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి నిలదీసేందుకే వెళ్తున్నామన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ గురించి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారీ కేటీఆర్ దమ్ముంటే తనను అరెస్టు చేసుకోండని సవాల్ చేస్తున్నారని అన్నారు. అయితే.. జైలుకు వెళ్లి వచ్చిన వారంతా ముఖ్యమంత్రులు అవుతున్నారని కేటీఆర్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరి అలాంటప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో ముందు పోయింది కవిత కదా.. కేటీఆర్ చెల్లె కవిత జైలుకు వెళ్లినప్పుడు ఆ అవకాశం కేటీఆర్‌కు ఎలా అవకాశం దక్కుతుందని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News