మనుషుల మనస్తత్వమే అంత!: కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ వ్యవహారంపై స్పందించిన నితిన్ గడ్కరీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ''ముందు పన్నులు తగ్గించ మంటారు. తర్వాత.. అసలు ఎందుకు? మొత్తానికే ఎత్తేయమంటారు.;
కేంద్ర మంత్రి, విజ్ఞానవంతుడిగా.. మేధావిగా పేరున్న నితిన్ గడ్కరీ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ''మనుషుల మనస్తత్వమే అంత!'' అంటూ.. నిప్పులు చెరిగారు. ''మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. ఒంటె తలకాయిలా ఉంటుంది. ఏ చిన్న అవకాశం ఇచ్చామా.. మొత్తం ఆక్రమించేయాలని చూస్తారు. మనుషుల మనస్తత్వమే ఇంత!'' అని వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
మహారాష్ట్రలో లారీ ఓనర్ల సంఘం భారీ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా రహదారులపై టోల్ గేట్ల రుసుమును తగ్గించాలని, రవాణాపై జీఎస్టీని సవరించాలని నాయకులు మంత్రికి విన్న వించారు. అంతేకాదు.. ప్రస్తుతం రవాణా రంగం కుదలేందని, దీనిపై లక్షలాది మంది జీవిస్తున్నారని తెలిపారు. కానీ కేంద్రం పెంచుతున్న రుసుములు, పన్నులు, జీఎస్టీ కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో వాటినితగ్గించే ప్రయత్నం చేయాలని విన్నవించారు.
ఈ వ్యవహారంపై స్పందించిన నితిన్ గడ్కరీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ''ముందు పన్నులు తగ్గించ మంటారు. తర్వాత.. అసలు ఎందుకు? మొత్తానికే ఎత్తేయమంటారు. రోడ్లు బాగోలేక పోతే బాగోలేవని ఏడుస్తారు.(రాస్తా అచ్చానైతో రోసక్తాహై). కానీ, పన్నులు మాత్రం వేయొద్దని సూక్తులు చెబుతారు. ఏమీ తీసుకోకుండా పనులు కావాలి. ఈ మనుషులు ఇంతే. పోనీ.. అంతో ఇంతో తగ్గిస్తే.. వారికి సంతృప్తి ఉండదు. మళ్లీ మళ్లీ తగ్గించాలని కోరతారు. అదేమంటే నిరసనల పేరుతో భయపెడతారు. ఈ పద్ధతి మార్చుకోండి. పన్నులు కట్టండి. రాయితీలు, ఎత్తివేతలు అడగొద్దు!'' అని ముక్లాయించారు.
దీంతో సభలో అందరూ ఖిన్నులయ్యారు. కాగా.. తన ప్రసంగం పూర్తికాగానే.. మంత్రి రుసరుస లాడుతూ.. వెళ్లిపోయారు. దీంతో ఆయనకు ఘన సత్కారం చేయాలని అనుకున్న యజమానులు మౌనంగా ఉండిపోయారు.