పోసానికి బెయిల్.. వచ్చినా జైల్లోనేనా?
ఇక రెండు రోజుల క్రితం ఓబుళవారిపల్లె పోలీసులు నమోదు చేసిన కేసులో పోసానికి బెయిల్ రాగా, ఈ రోజు నరసారావుపేట కేసులోనూ ఉపశమనం లభించింది.;
సినీ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని క్రిష్ణమురళికి బెయిల్ మంజూరైంది. పల్నాడు జిల్లా నరసారావుపేట పోలీసుస్టేషన్ లో నమోదైన కేసులో ఆయనకు సోమవారం బెయిల్ మంజూరు చేస్తూ న్యాయాధికారి తీర్పునిచ్చారు. అయితే ప్రస్తుతం పోసానిపై ఇంకా కొన్ని కేసులు విచారణలో ఉండటం, ఆయా కేసుల్లో బెయిల్ లభించకపోవడంతో ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు లేవంటున్నారు.
సినీ నటుడు పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 కేసులు నమోదైన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీసులు గత నెలలో పోసానిని అరెస్టు చేయగా, ఆ తర్వాత వరుసగా ఇతర పోలీసుస్టేషన్లకు చెందిన అధికారులు పీటీ వారంటు దాఖలు చేసి పోసానిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇలా ఆయన ప్రస్తుతం రిమాండు టూరులోనే తిరుగుతున్నారు. ఒక రోజు రాయలసీమ కోర్టుకు వెళితే మరసటి రోజు కోస్తా.. ఆ తర్వాత దక్షిణ కోస్తా ఇలా అటు నుంచి ఇటు... ఇటు నుంచి అటు తిప్పుతున్నారు.
ఇక రెండు రోజుల క్రితం ఓబుళవారిపల్లె పోలీసులు నమోదు చేసిన కేసులో పోసానికి బెయిల్ రాగా, ఈ రోజు నరసారావుపేట కేసులోనూ ఉపశమనం లభించింది. అయితే మిగిలిన కేసులు విచారణలో ఉండటం, ఆ కేసుల్లో బెయిల్ మంజూరు అవ్వాల్సివున్నందున పోసాని మరికొద్ది రోజులు కారాగార వాసం చేయకతప్పదని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఒక కేసులో బెయిల్ వచ్చినందున మిగిలిన కేసుల్లోనూ అదే సెక్షన్లు చూపి బెయిల్ తెచ్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. దీంతో కొద్దిరోజుల్లోనే ఆయన బెయిల్ పై విడుదలయ్యే చాన్స్ కనిపిస్తోందని అంటున్నారు.