పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా... మరచి పోవాల్సిందే !
పవన్ కళ్యాణ్ అడ్డా పిఠాపురం అని నాదెండ్ల పేర్కొన్నారు. ఆయన సొంత ప్లేస్ అని ఆయన ఎవరికి చెక్ పెడతారు అని ప్రశ్నించారు.;
జనసేన అధినేతకు ఏపీలో సొంత నియోజకవర్గం అంటూ ఏదీ లేదని వైసీపీ నేతలు వారు అధికారంలో ఉన్నపుడు గేలి చేసేవారు. వేళాకోళం చేసేవారు. పవన్ కూడా చాలా సార్లు ఇదే విషయం మీద బాధపడేవారు. తాను రాష్ట్రం దేశం అని విశాలంగా ఆలోచిస్తాను తప్ప ఇది తన ప్రాంతం అని తాను పోటీ చేయడానికి కూడా ఒక చోటుని చూసుకోలేకపోయాను అని చెప్పుకొచ్చేవారు.
మొత్తానికి ఎలాగైతేనేమి పవన్ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. అక్కడ ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేసి దాదాపుగా 70 వేల పైచిలుకు మెజారిటీతో ఘన విజయం సాధించారు. దాంతో పవన్ కళ్యాణ్ మా ఎమ్మెల్యే అని జనసైనికులతో పాటు అభిమానులు అంతా బైకులకు బోర్డులు తగిలించి మరీ ఊరేగారు. పవన్ కేరాఫ్ పిఠాపురం అన్నది బాగా పాతుకుపోయింది.
పిఠాపురంలో పవన్ సామాజిక వర్గం అధికంగా ఉండడంతో పాటు వారంతా ఆయనను స్వాగతించడంతో ఆయనకు అది సొంత నియోజకవర్గం అయింది. పవన్ రాజకీయాల్లో ఉన్నంతవరకూ పిఠాపురం తప్ప మరో చోటుకు వెళ్ళరని కూడా అప్పట్లోనే చెప్పుకున్నారు. దానికి తగినట్లుగా ఇపుడు ఆ పార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ చేసిన ఒక ప్రకటన రాజకీయంగా చర్చకు తావిస్తోంది.
పవన్ కళ్యాణ్ అడ్డా పిఠాపురం అని నాదెండ్ల పేర్కొన్నారు. ఆయన సొంత ప్లేస్ అని ఆయన ఎవరికి చెక్ పెడతారు అని ప్రశ్నించారు. పవన్ ని పిఠాపురం ప్రజలు గెలిపించారు కాబట్టే వారికి ధన్యవాదాలు తెలిపే విధంగా జనసేన ప్లీనరీని అక్కడ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.
యావత్తు జనసేన సైన్యం అంతా పిఠాపురం వచ్చి మరీ ప్లీనరీని ఈ నెల 14న జయప్రదం చేస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశారని వాటిని ప్రజలకు వివరిస్తారు అని ఆయన చెప్పారు.
పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలు చూపించిన అభిమానానికి ఆయన కూడా తాను ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా సేవ చేస్తూ వస్తున్నారని ఆయన గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం. ఆయన అడ్డా అందువల్ల ఎవరికి ఎవరూ ఇక్కడ చెక్ పెట్టరంటూ నాదెండ్ల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పిఠాపురంలో ఒక్కసారి పోటీ అంటే టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వర్మ తప్పుకున్నారని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. ఇపుడు చూస్తే పవన్ ఎన్ని సార్లు అయినా అక్కడ నుంచే పోటీ చేస్తారు అన్నది నిర్ధారణ అయింది. అంతే కాదు ఆయన సొంతంగా అక్కడే ఇల్లు కట్టుకుంటున్నారు. తన మకాం అంతా మార్చుకుంటున్నారు.
దాంతో ఇక వర్మ సహా ఎవరైనా పిఠాపురం నుంచి పోటీ చేయాలీ అనుకుంటే కనుక పవన్ తో తలపడాల్సిందే అని అంటున్నారు. లేకపోతే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ ఆలోచనను మరచిపోవాల్సిందే అని అంటున్నారు. వైసీపీ నుంచి పోటీ ఉంటుందేమో కానీ కూటమి పక్షాన పవనే అక్కడ శాశ్వత నాయకుడు అని నాదెండ్ల చెప్పాక ఇక వేరే డౌటేముంటుంది. సో అదన్న మాట మ్యాటర్.