మాజీ వైసీపీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయా ?

ఇపుడు ఆయన పదవీకాలం ముగిసిన వేళ ఎంత ప్రయత్నించినా ఆయనకు కూడా ఎమ్మెల్సీ సీటు దక్కలేదు. దాంతో ఆయన వర్గం కూడా డీలా పడిపోయింది.;

Update: 2025-03-10 17:30 GMT

రాజకీయాల్లో లెక్కలు పక్కాగా ఉంటాయి. అటూ ఇటూ బలాబలాలు మోహిరించిన తరువాత ఎదురు బొదురు రాజకీయ సమరం సాగించిన తరువాత ఒకరు విజేత అవుతారు. ఆనక ఆ రెండవ శిబిరం నుంచి గెలుపు శిబిరం వైపునకు దూకితే అందలాలు అందుతాయా వారిని వారితో పడిన గత రాజకీయ ఇబ్బందులను ఈ వైపు వారు మరచిపోతారా అన్నది చర్చ.

మరి ఇంత చిన్న లాజిక్ మిస్ అయి ఈ వైపు నుంచి ఆ వైపునకు సులువుగా దూకేసి అక్కడ ఏదో ఉద్ధరిద్దమానుకుంటే చివరికి మిగిలిందేమిటి అన్నదే ప్రశ్న. ఇదంతా ఎందుకు అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన మాజీ నేతల గురించే. ఏపీలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు అయింది. అదే సమయంలో కూటమి అధికారంలోకి వచ్చింది.

ఇంకేముంది కండువాలు సులువుగా మార్చేసి కొంతమంది ఆ వైపునకు వెళ్ళిపోయారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ గురించే. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఈ ఏడాది జూన్ దాకా ఉంది. కానీ ఏడాది ముందే తన పదవిని వదిలేసుకున్నారు. పసుపు కండువా కప్పుకున్నారు. దానికి గానూ ఆయనకు దక్కిన హామీ ఏంటి అంటే ఏపీ మండలిలో ఎమ్మెల్సీ పదవి.

అలా హామీ ఇచ్చి ఆయన నుంచి తీసుకున్న ఎంపీ సీటులో టీడీపీ నేత నెగ్గి పెద్దల సభకు వెళ్ళారు. కానీ మోపిదేవి మాత్రం ఇపుడు ఎమ్మెల్సీ రేసులో ఎక్కడా పేరు కూడా వినిపించకుండా వెనక్కివెళ్ళారు. దాంతో మోపిదేవి కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ ఫ్యామిలీ పట్ల నిబద్ధత కనబరుస్తూ వచ్చారు ఇన్నేళ్ళూ టీడీపీతో రాజకీయ వైరాన్ని కనబరచారు. ఇపుడు ఆ శిబిరంలోకి వచ్చి ఏమి బావుకున్నారు అన్నది ఒక ప్రశ్నగా ఉంది.

ఇక బీసీల నేతగా ఉన్న జంగా క్రిష్ణమూర్తి పదవీ కాలం ఈ నెల 30తో అయిపోయింది. ఆయన వైసీపీ నుంచి 2019లో నెగ్గారు. 2019 ఎన్నికలకు ముందే జగన్ ఆయనకు పెద్దల సభలో అలా అకామిడేట్ చేశారు. పార్టీ గెలిచిన తరువాత కూడా ఆయనకు గౌరవం దక్కిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. తీరా 2024 ఎన్నీకల ముందు ఆయన టీడీపీలోకి జంప్ అయ్యారు.

ఇపుడు ఆయన పదవీకాలం ముగిసిన వేళ ఎంత ప్రయత్నించినా ఆయనకు కూడా ఎమ్మెల్సీ సీటు దక్కలేదు. దాంతో ఆయన వర్గం కూడా డీలా పడిపోయింది. మరో కీలక నేత జగన్ బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరారు. ఆయన ఏకంగా ఎమ్మెల్సీ అయి మంత్రి కూడా అవుతారు అని ఒక దశలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగింది.

కానీ అయిదు ఎమ్మెల్సీ ఖాళీలు అలా భర్తీ అయిపోయాయి కానీ బాలినేని ఊసే లేదని అంటున్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం తాజాగా ఒంగోలు కార్పొరేషన్ మొత్తాన్ని జనసేనతో నింపేశారు. వైసీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి మరీ జనసేన అధినాయకత్వాన్ని మెప్పించారు. కానీ చివరికి ఆయనకూ నిరాశ తప్పలేదని అంటున్నారు.

మళ్ళీ 2027 దాకా ఎమ్మెల్సీ ఖాళీలు అయితే లేవు. దాంతో అప్పటిదాకా నిరీక్షణ తప్పదు. ఇక అప్పటికి చూస్తే మరో రెండేళ్ళు మాత్రమే కూటమికి అధికారం ఉంటుంది. పైగా ఎన్నికల మూడ్ కూడా వచ్చేస్తుంది. ఆ సమయంలో అధికారం దక్కినా అది అంతగా సంతృప్తిని ఇవ్వదు. ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి.

ఇక చూసుకుంటే అప్పటి ఎంపికలు కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఉంటాయి. దాంతో మాజీ వైసీపీ నేతలకు ఎంతవరకూ న్యాయం జరుగుతుంది అన్నది కూడా చెప్పలేరని అంటున్నారు. అసలే కూటమి ప్రభుత్వం పదవులు వస్తే మూడు పార్టీలు పంచుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ సమయంలో వైసీపీ నుంచి వెళ్ళిన వారికి పదవులు రావడం అంటే కష్టమే అని అంటున్నారు. ఈ చిన్న లాజిక్ ని అర్ధం చేసుకోకుండా జంప్ చేశారా అన్నదే చర్చగా ఉంది మరి.

Tags:    

Similar News