'ఈడీ' వారింటి పెంపుడు కుక్క: మాణిక్కం సంచలన వ్యాఖ్యలు
అయితే.. ఈ ఘటనపై మాణిక్కం ఠాకూర్ స్పందించారు. ఈడీ దాడులను అసంబద్ధమైనవిగా ఆయన పేర్కొన్నారు.;
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇంచార్జ్, ఎంపీ మాణిక్కం ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇంటి పెంపుడు కుక్కగా మారిందని తీవ్ర విమ ర్శలు సంధించారు. తాజాగా ఆయన ఓ ప్రకటన చేస్తూ.. ఈడీపై విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ భాగల్, ఆయన కుమారుడు, మాజీ మంత్రి చైతన్య భాగల్ నివాసాలపై సోమవారం ఈడీ అధికారులు దాడులు చేశారు. మనీలాండరింగ్ కేసులకు సంబంధించి వారి ఇళ్లపై దాడులు చేసిన అధికారులు.. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అయితే.. ఈ ఘటనపై మాణిక్కం ఠాకూర్ స్పందించారు. ఈడీ దాడులను అసంబద్ధమైనవిగా ఆయన పేర్కొన్నారు. ''ఈడీ.. అనేది ఓ పెంపుడు కుక్క. అది మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ల ఇళ్లకు కాపలా కాస్తుంది. వారు చెప్పిన చోటకు చెప్పినట్లు వెళ్తుంది. అయినా.. కుక్కలకు భయపడే రోజులు పోయాయి'' అని మాణిక్కం వ్యాఖ్యానించారు. భూపేష్ భాగల్.. ప్రజానేత అని.. ఆయన ఇలాంటి వాటిని చూసి భయపడే రకం కాదని వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఎన్నికలకు ముందు ఇలానే కొందరు మొరిగారని.. కానీ, ఏమీ చేయలేకపోయారని పరోక్షంగా బీజేపీ నాయకులను మాణిక్కం దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్నర్ చేసుకుని దాడులు చేయడంలో ఈడీ పేరొందిన సంస్థగా మారిందని.. కక్ష సాధింపులు, రాజకీయ వేధింపులకు కేరాఫ్‌గా మారిపోయిందని మాణిక్కం అన్నారు. అయితే.. వీటికి కాంగ్రెస్ పార్టీ నాయకులు బలంగా బుద్ధి చెబుతారని చెప్పారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ నేతల వెంటే ఉన్నారన్న ఆయన.. ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టే రోజు త్వరలోనే ఉందన్నారు. కాగా, గత ఏడాది ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరిగిన ఓ కుంభకోణం కేసు తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. నేరుగా అప్పటి సీఎం భూపేష్ భాగల్ పేరును ప్రధాని మోడీ కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై సీబీఐ, ఈడీ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే తాజాగా ఈడీ అధికారులు బాగల్ నివాసాలపై దాడులు చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.