ప్రణయ్ హత్య కేసు తీర్పు : ఈరోజు జరిగిన కీలక పరిణామాలు ఇవీ!
ఈ విషయంపై స్పందించిన ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్, అమృతకు తన సానుభూతి తెలియజేశారు.;
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో కోర్టు తుది తీర్పును ప్రకటించింది. నిందితుల్లో ప్రధానమైన మారుతి రావు మరణించగా, A2 గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించబడింది. మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించిన అనంతరం నల్గొండ జిల్లా పోలీసులు వారిని భారీ భద్రత నడుమ జిల్లా జైలుకు తరలించారు. తీర్పు అనంతరం నిందితులు తమ శిక్షను తగ్గించమని కోర్టును వేడుకున్నారు.
గుజరాత్‌లో ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న A3 ఐఎస్ఐ ఉగ్రవాది అజ్గర్ అలీని తిరిగి అక్కడికి పంపించారు. తీర్పు వెలువడిన అనంతరం ప్రణయ్ తండ్రి బాలస్వామి మీడియాతో మాట్లాడారు. న్యాయం గెలిచిందని, తమ కన్నీళ్లు వృథా కాలేదని, ఈ తీర్పు వారి పోరాటానికి ఫలితమని అన్నారు.
- శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యుల ఆవేదన
నిందితుల్లో ఒకరైన శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులు, ఆయనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తమ తండ్రికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, మీడియా ప్రభావంతో ఆయనను ఇరికించారని శ్రవణ్ కూతురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పోలీసులతో వాగ్వాదం జరిగినప్పటికీ, పోలీసులు వారిని నచ్చజెప్పి అక్కడినుంచి పంపించారు.
- ఏవీ రంగనాథ్‌కు అమృత కృతజ్ఞతలు
నిందితులకు శిక్ష విధించిన తీర్పు వెలువడిన తర్వాత, జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాతో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ నిందితులకు కఠిన శిక్ష పడిందని పేర్కొన్నారు. ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెరిగిందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, హత్య జరిగిన సమయంలో నల్గొండ ఎస్పీగా పనిచేసిన, ప్రస్తుతం హైద్రాబాద్ కమీషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్‌కు అమృత ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రణయ్‌ను హత్య చేసిన వ్యక్తికి ఉరిశిక్ష, మిగతా నిందితులకు జీవితఖైదు పడేలా కేసును సమర్థంగా నడిపినందుకు రంగనాథ్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- హామీ నిలబెట్టిన ఏవీ రంగనాథ్
ఈ విషయంపై స్పందించిన ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్, అమృతకు తన సానుభూతి తెలియజేశారు. "నీకు నేను ఇచ్చిన హామీ నిలబెట్టాను. న్యాయం జరిగేలా అన్ని ప్రయత్నాలు చేశాం, ఈ తీర్పుతో న్యాయవ్యవస్థపై విశ్వాసం పెరిగింది" అని అన్నారు. తీర్పును స్వాగతించిన అమృత, ప్రణయ్ తల్లి, ఈ తీర్పు తమ పోరాటానికి సముచిత న్యాయంగా అభివర్ణించారు.
ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యాయవ్యవస్థ తీసుకున్న నిర్ణయం, ప్రణయ్ కుటుంబానికి కొంతవరకు న్యాయం అందించినట్లు భావిస్తున్నారు.