టీడీపీ ఎంపీ యమా స్పీడు.. అధినేత చంద్రబాబు కన్నా జోరు!
ఎంపీగా గెలిచిన నుంచి తనదైన శైలిలో అడుగులేస్తున్న ఎంపీ అప్పనాయుడు తాజాగా చేసిన ఓ ప్రకటన ప్రభుత్వానికి కాస్త ఝలక్ ఇచ్చింది.;
టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీల్లో ఆయన ఒకరు. చట్టసభల్లోకి అడుగుపెట్టాలని పట్టుబట్టి మరీ టికెటు సాధించారు. ఎమ్మెల్యే అవ్వాలనుకుని యువనేత లోకేశ్ కు దగ్గరయ్యారు. తన తెలివితేటలు, కలుపుగోరు తనంతో అధినేత మనసు దోచుకున్నారు. ఆర్థికంగా అంతంతమాత్రమే అయినా ఆయన కమిట్మెంట్ కు ఫిదా అయిన సీఎం చంద్రబాబు గత ఎన్నికల్లో పార్లమెంటు సీటు ఇచ్చారు. పార్టీ అండ, సొంత సామాజికవర్గం సానుభూతి, అందరితో కలుపుకుని వెళ్లే మనస్తత్వం ఆయనను ఎంపీగా గెలిపించింది. అలా గెలిచిన నుంచి తనకంటూ ఓ విలక్షణ శైలితో దూసుకుపోతున్నారు. టీడీపీలో మిగిలిన ఎంపీలకంటే ఎక్కువగా జోరు చూపుతున్నారు. ఆ ఎంపీ స్పీడుకు అధినేత చంద్రబాబు కూడా ఉలిక్కి పడాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఎన్టీఆర్ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా ఎంపీ? ఏంటా జోరు అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే...
టీడీపీలో ఎంపీల్లో విజయనగరం పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు స్పీడు పసుపు దళంలో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. ఎంపీగా గెలిచిన నుంచి తనదైన శైలిలో అడుగులేస్తున్న ఎంపీ అప్పనాయుడు తాజాగా చేసిన ఓ ప్రకటన ప్రభుత్వానికి కాస్త ఝలక్ ఇచ్చింది. ఆదర్శం కోసం ఎంపీ తొలి అడుగు వేసిన ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎలా స్వాగతించాలా? అంటూ టీడీపీ హైకమాండ్ తర్జనభర్జన పడుతోందని అంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ కీలక ప్రకటన చేసి అందరినీ ఆకర్షించారు ఎంపీ అప్పలనాయుడు. తన నెల జీతం నుంచి ఇకపై మూడో ఆడబిడ్డ కనే తల్లిదండ్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటిస్తానని ప్రకటించారు. అంతేకాకుండా మగబిడ్డను కన్నవారికి ఆవు, దూడ బహూకరిస్తానని చెప్పారు. ఇలా తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో ఎవరికి బిడ్డ పుట్టినా డబ్బులిస్తానని ప్రకటించడం ఎంపీ అప్పలనాయుడు ఆదర్శమే అయినా, పొరపాటున నిధులు సమస్య వస్తే పార్టీకి డ్యామేజ్ కదా? అంటూ ఆయన ప్రత్యర్థులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంతేకాకుండా ఒక్కో బిడ్డకు రూ.50 వేలు చొప్పున ఎంపీ ఇస్తే, ఆ ప్రభావం భవిష్యత్తులో ప్రభుత్వంపైనా పడుతుందనే చర్చ జరుగుతోంది.
తగ్గుతున్న జనాభాను స్థిరీకరించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఇద్దరు పిల్లల నిబంధనను సడలించాలని గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భవిష్యత్తుల్లో ఎదురయ్యే సవాళ్లను పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు కాస్త ముందే మేలుకుని యువ జంటలు ముగ్గురు, నలుగురు పిల్లలను కనేలా ప్లాన్ చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. ఇక మూడో బిడ్డ కన్నవారిని ప్రసూతి సెలవులు కూడా ఇస్తామని తాజాగా ప్రకటించారు. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసి అందరూ పోటీ చేసేలా అవకాశం కల్పించారు. జనాభా పెంపుదల కోసం నగదు రహితంగా సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తుంటే, ఎంపీ అప్పలనాయుడు వెనుక ముందు ఆలోచించకుండా ఆర్థిక ప్రోత్సాహం ప్రకటించడం పార్టీలో చర్చకు తావిస్తోంది.
ఎంపీ అప్పలనాయుడు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతో అభిమానం. ఎన్నికల ఫలితాలు విడుదలైన కొత్తలో ఢిల్లీకి వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ ఉందా? అంటూ సీఎం అడగటంతో అప్పలనాయుడు ఆర్థిక పరిస్థితిపై అప్పట్లో భారీ ఎత్తున చర్చ జరిగింది. సామాన్య కార్యకర్త నుంచి ఎంపీగా ఎదిగిన అప్పలనాయుడు తన క్షేత్రస్థాయి అనుభవనాలను వదులకోకపోవడం వ్యక్తిగతంగా ఆయనకు అడ్వాంటేజ్ అంటూ చెబుతున్నారు. అయితే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధినేత చంద్రబాబు అండదండలతో ఎంపీ అప్పలనాయుడు దూకుడుగా ఉన్నప్పటికీ, ఆయనకు అపఖ్యాతి తెచ్చేలా పొరపాటున కూడా వ్యవహరించొద్దని కార్యకర్తలు కోరుతున్నారు. ఇక ఎంపీ అప్పలనాయుడు జోరుతో అధినేత చంద్రబాబు ఖుషీగా ఉన్నా, ఆయన చేస్తున్న ప్రకటనల పట్ల కాస్త కంట్రోల్ ఉండాలనే అభిప్రాయపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.