సీఎంగా చంద్రబాబు ప్రమాణం.. వైసీపీ ప్రభుత్వ బాధితులకు స్పెషల్ గ్యాలరీ

సరిగ్గా వారం రోజుల కిందట వెలువడిన ఏపీ అసెంబ్లీ ఫలితాలు దేశాన్ని నివ్వెరపోయేలా చేశాయి

Update: 2024-06-10 11:24 GMT

సరిగ్గా వారం రోజుల కిందట వెలువడిన ఏపీ అసెంబ్లీ ఫలితాలు దేశాన్ని నివ్వెరపోయేలా చేశాయి. కనీవిని ఎరుగని రీతిలో టీడీపీ-జన సేన-బీజేపీ కూటమి 164 సీట్లు గెలుచుకుంది. అత్యంత బలంగా కనిపించిన వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. బహుశా భవిష్యత్ లో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ల్యాండ్ స్లైడ్ విక్టరీ కనిపించదేమో? అయితే, ఇక మిగిలింది కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారమే..

ముహూర్తం వాయిదా..

ఏపీలో కూటమి విజయంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీఎం కావడం తథ్యమని తేలిపోయింది. అయితే, తొలుత ఈ నెల 9 ఆదివారం నాడు ప్రమాణం ఉంటుందనే ఊహాగానాలు వచ్చాయి. కానీ, కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు ఏర్పాటు నేపథ్యంలో వాయిదా వేశారు. బుధవారం నాడు విభజిత ఏపీకి రెండోసారి, మొత్తమ్మీద నాలుగోసారి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆ ప్రభావం లేకుండానే..

ఎవరు ఎన్ని చెప్పినా.. రాజకీయాల్లో చంద్రబాబుకు మార్గదర్శి ఎవరంటే ఈనాడు అధినేత రామోజీరావే. అలాంటి రామోజీరావు శనివారం తుదిశ్వాస విడిచారు. కానీ, ఈ ప్రభావం ఏమీ లేకుండానే బుధవారం చంద్రబాబు ప్రమాణస్వీకారానికి గన్నవరం దగ్గర కేసరపల్లిలో ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.

వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు..

2019 తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. అయితే, రాజకీయ కోణంలో టీడీపీ శ్రేణులను టార్గెట్ గా చేసుకుందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వైసీపీ కూడా తమ శ్రేణులపై దాడులు జరుగుతున్నట్లు వాపోతోంది. దీన్నంతటినీ పక్కనపెడితే.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి.. ‘వైసీపీ ప్రభుత్వ బాధితులకు‘ టీడీపీ ఆహ్వానం పంపింది. వీరిలో అబ్దుల్‌ సలాం, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం సహా 104 కుటుంబాలు ఉండడం గమనార్హం. వీరందరినీ వైసీపీ ప్రభుత్వం బాధితులుగా పేర్కొంటూ వారి కోసం ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Tags:    

Similar News