'నా కాళ్లకు దండం పెడితే... మీ కాళ్లకు దండం పెడతా'... బాబు సెన్షేషన్!
ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ... ఈ కాళ్లకు దండం పెట్టే సంస్కృతిపై స్పందించారు
సాధారణంగా కాస్త వయసులో పెద్దవాళ్లు ఎవరైనా కనిపిస్తే కాళ్లకు దండం పెడుతుంటారు చిన్నవాళ్లు! అయితే... చాలా మంది ఈ సంస్కృతి వద్దని... భగవంతుడికి, తల్లి తండ్రులకు పాదాలకు మాత్రమే దండం పెట్టాలని అంటుంటారు. గరికపాటి నరసింహరావు కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్థావించారు. తన కాళ్లకు దండం పెట్టి తన పాండిత్యాన్ని కొట్టేయలేరని చమత్కరిస్తుంటారు.
ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ... ఈ కాళ్లకు దండం పెట్టే సంస్కృతిపై స్పందించారు. ఈ సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... రాజకీయాల్లో పాదాభివందనాలు చేస్తూ అడుగులకు మడుగులొత్తే సంస్కృతికి తెరదించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతలకు కీలక సూచన చేశారు. ఇదే సమయంలో తాను కూడా ఇకపై దీన్ని పాటిస్తానని ప్రకటించారు.
అవును... శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని నేతలకు సూచించారు. ఇకపై ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే.. వారి కాళ్లకు తాను కూడా దండం పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా స్పందించిన బాబు... జన్మనిచ్చిన తల్లితండ్రులు, భగవంతుడి కాళ్లకు మాత్రమే దండం పెట్టాలి తప్ప రాజకీయ నాయకులకు కాదని చంద్రబాబు తేల్చి చెప్పారు. నాయకుల కాళ్లకు దండాలు పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని సూచించారు. ఈ క్రమంలోనే రాజకీయ నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దని ప్రజలు, పార్టీ శ్రేణులకు దండం పెట్టొద్దనే సంస్కృతి తన నుంచి స్టార్ట్ చేస్తున్నట్లు బాబు తెలిపారు.