చంద్రబాబు తనకు తానే త్యాగం చేసుకుంటున్నారా?!
దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.. చంద్రబాబు తనకు తానే త్యాగం చేసుకునే పరిస్థితి ఏర్పడడం! ఔను.. ఇప్పు డు ఈ మాటే వినిపిస్తోంది
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చుట్టూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కూటమిలో ఉన్న ఆధిపత్య ధోరణి ఎవరివి? 1 శాతం ఓట్లు కూడా లేని బీజేపీదా..? 48 శాతం ఓటు బ్యాంకు ఉన్న టీడీపీదా? ఇదీ.. ఇప్పుడు ప్రశ్న. దీనిపై కీలక ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా వస్తున్న ప్రశ్నలు, ఎదురవుతున్న విమర్శలు అన్నీ ఇన్నీకాదు. నిజానికి ఇప్పుడు కూటమిలో ఐక్యత కనిపించాలి. పైకి అలా ఉందని చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం కుమ్ములాటలు కనిపిస్తూనే ఉన్నాయి.
దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.. చంద్రబాబు తనకు తానే త్యాగం చేసుకునే పరిస్థితి ఏర్పడడం! ఔను.. ఇప్పు డు ఈ మాటే వినిపిస్తోంది. తాజాగా నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు ఉండి అసెంబ్లీ స్థానాన్ని ఇచ్చారు. ఇది తప్పుకాదు. సుదీర్ఘకాలంగా రఘురామ వైసీపీపై పోరు బాటపట్టి ఎంతో కష్టపడ్డారు. దాదాపు రెండేళ్లపాటు ఆయన టీడీపీకి అనధికార ప్రతినిధిగానూ పనిచేశారు. ఇది ఆయన చెప్పుకొన్న మాటే.
కాబట్టి.. ప్రస్తుత ఎన్నికల్లో రఘురామకు టికెట్ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. కానీ, రఘురామ కు టికెట్ ఇచ్చే విషయంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు.. బయటకు వచ్చిన వ్యాఖ్యలు.. దీనికి ముందు జరిగిన పరిణామాలు వంటివి.. కూటమిలో ఆధిపత్యంపూర్తిగా బీజేపీదేనా? అనే సందేహా లకు తావిస్తోంది. ``రఘురామకు నరసాపురం టికెట్ ఇవ్వమని బీజేపీకి చెప్పాం. చాలా రోజులు వెయిట్ చేశాం. కానీ, ఇవ్వలేదు. ఏం చేస్తాం.. మనంఇవ్వాల్సి వచ్చింది.. మీరు కొంచెం తగ్గండి`` అని బాబు మంతెన రామరాజును కోరే పరిస్థితి వచ్చింది.
అంటే.. ఇక్కడ నరసాపురం టికెట్ విషయంలోనే బీజేపీ.. బాబు అభ్యర్థనను బుట్టదాఖలు చేసిందనే వాదనను ప్రత్యర్థి పార్టీలు కార్నర్ చేస్తున్నాయి. అంతేకాదు.. గతంలో రఘురామ అన్నట్టుగా.. ఒక్కసీటును ఇప్పించలేకపోతే.. రేపు పోలవరం, రాజధాని వంటివి ఏం సాధిస్తారన్న ప్రశ్నలు.. అప్పటి ఆయన ఇంటర్వ్యూ వంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున హల్చల్ చేస్తున్నాయి. దీనికి బాబు ఏం చెబుతారనేది ప్రశ్న.
మరోవైపు టీడీపీ టికెట్లు ప్రకటించిన అరకు వంటి స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడ బాబుకు అగ్ని పరీక్ష ఎదురైంది. అప్పటికప్పుడు తన అభ్యర్థులను వెనక్కి తీసుకుని వారికి వేరే చోట ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ కూటమిలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నాయి. వీటిని బయట పడకుండా అయినా చేసుకోవాలి.. లేదా.. లోపాలు రాకుండా అయినా వ్యవహరించాలి. లేకపోతే.. మున్ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవనే హెచ్చరికలు వస్తున్నాయి.