దండకారణ్యంలో తుపాకుల మోత... 12 మంది మృతి!!
ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో ఈ నెల మొదటి ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే.
ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో ఈ నెల మొదటి ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. చల్పాక అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు! ఈ నేపథ్యంలో తాజాగా ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలో కాల్పుల మోత మోగింది.
అవును... ఛత్తీస్ గఢ్ దండకారణ్యం మళ్లీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్ పూర్ జిల్లాలోని అబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని అంటున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో దాదాపు 12 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తోంది. దీంతో... ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారింది.
ఛత్తీస్ గఢ్ లోని నారాయణ్ పుర్, దంతెవాడ, కొండగావ్, జగదల్ పూర్ జిల్లాల భద్రతా బలగాలు బస్తర్ పరిధిలోని అబూజ్ మడ్ అటవీ ప్రాతంలో కూంబింగ్ చేపట్టాయని అంటున్నారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో భాగంగా జరిగిన ఈ కూంబింగ్ లో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్.టీ.ఎఫ్. దళాలు సంయుక్తంగా పాల్గొన్నాయని తెలుస్తోంది.
ఈ సమయంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా.. వారిపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారని.. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయని.. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకూ దాదాపు పన్నెండు మంది వరకూ చనిపోయినట్లు చెబుతున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అంటున్నారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని అంటున్నారు.