చైనా ‘అణు’ నేను.. ఏడాదిలో 100 వార్ హెడ్ లు.. మొత్తం 600 అస్త్రాలు

ప్రపంచ దేశాల మధ్య అసలే ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.. ఎప్పుడు ఏ దేశం మధ్య ఘర్షణ జరుగుతుందో తెలియని పరిస్థితి.

Update: 2024-12-19 14:30 GMT

ప్రపంచ దేశాల మధ్య అసలే ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.. ఎప్పుడు ఏ దేశం మధ్య ఘర్షణ జరుగుతుందో తెలియని పరిస్థితి. ఉక్రెయిన్-రష్యా, హమాస్-ఇరాన్-ఇజ్రాయెల్, చైనా-తైవాన్, సిరియా-ఇజ్రాయెల్ ఇలా పలు దేశాల మధ్య యుద్ధాలు/ఘర్షణలు సహజంగా మారాయి. ఇలాంటి సమయంలో అణు దాడులు జరిగితే..? ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై అణు దాడులకు దిగుతామని హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో కీలక విషయం వెలుగుచూసింది.

డ్రాగన్ అణు గర్జన

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైనదే కాదు.. తమ ప్రయోజనాల కోసం ఎవరి మాటా వినని దేశం చైనా. అలాంటి చైనాపై అమెరికా ఎప్పుడూ కాలు దువ్వుతూనే ఉంటుంది. ఇప్పుడు డ్రాగన్ పై ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం చైనా ఏడాదిలో 100 వార్‌ హెడ్‌ లను తయారుచేసింది. ఇప్పుడు దాని దగ్గర 600 అణ్వస్త్రాలు ఉన్నాయి. ఆ దేశం భారీగా అణు ఆయుధాలను పెంచుకుంటోందని ఆరోపించింది.

శరవేగంగా అణు అడుగులు..

చైనా శరవేగంగా అణు ఆయుధాలు తయారు చేస్తోందని అమెరికా రక్షణ శాఖ ఆరోపిస్తోంది. ఈ ఏడాది జూన్ వరకే 600 పైగా అణు వార్‌ హెడ్‌ లు చైనా వద్ద ఉన్నట్లుగా తెలిపింది.

నాలుగేళ్లలో 200.. ఏడాదిలో వంద

చైనా అణు ఆయుధాల్లో కొత్తగా తయారు చేసినవే 100 అని అమెరికా పేర్కొంటోంది. మొత్తం 600 ఆయుధాల్లో గత ఐదేళ్లలో తయారు చేసినవి 200. సంవత్సరంలో తయారుచేసినవి 100 ఉండడం విశేషం. ఇక మరో ఐదేళ్లలో చైనా 1,000 వార్‌ హెడ్‌ లను సిద్ధం చేసుకోవచ్చని అమెరికా గతంలో అంచనా వేసింది.

అణు వైవిధ్యంతో..

చైనా వద్ద చాలా చిన్నవి, 20 ఏళ్ల నాటి కాలం చెల్లిన అణు ఆయుధాలు ఉన్నాయనేది అమెరికా ఆరోపణ. అంతేకాక.. బీజింగ్‌ సైనిక బడ్జెట్‌ అసలు చెప్పేదాని కంటే 40 నుంచి 90 శాతం అధికంగా ఉండొచ్చని అంటోంది. చైనా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులు వారి అణు సామర్థ్యాన్ని మరింత పెంచాయని పేర్కొంది. న్యూక్లియర్‌ ట్రైయాడ్‌ ను బలోపేతం చేసుకోవడంతో పాటు.. నేవీ బాలిస్టిక్‌ మిసైల్‌ సబ్‌ మెరైన్లతో డ్రాగన్ గస్తీ నిర్వహిస్తోందని తెలిపింది. గమనార్హం ఏమంటే.. అణ్వాయుధాలపై మనుషుల నియంత్రణే కొనసాగించాలని అమెరికా-చైనా మధ్య ఒప్పందం కుదిరిన కొన్ని వారాలకే ఈ నివేదిక బయటకు రావడం.

అణు నియంత్రణ మాకేనా?

ప్రపంచంలో అమెరికా, రష్యా వద్ద భారీగా అణు ఆయుధాలు ఉన్నాయి. దీంతో నియంత్రణను చైనా వ్యతిరేకిస్తోంది. రష్యా, అమెరికా సంగతేమిటని ప్రశ్నిస్తోంది. తమ భద్రతపై రాజీ లేదని.. తగిన అణు ఆయుధాలు ఉంచుకుంటామని స్పష్టం చేసింది.

Tags:    

Similar News