పాపం సుబ్రహ్మణ్యం.. పాములు ఇతడి మీద పగబట్టాయా?

ఈ పాముల దెబ్బకు ఊరు విడిచి బెంగళూరుకు వలస వెళ్లాడు. అక్కడ కూడా పాములు అతడ్ని వదల్లేదు.;

Update: 2025-03-18 07:32 GMT

కొన్ని ఉదంతాలు ఎందుకు చోటు చేసుకుంటాయో కూడా అర్థం కాదు. ఇప్పుడు చెప్పేది కూడా ఆ కోవలోకే. ఈ మొత్తం చదివిన తర్వాత ఆశ్చర్యపోవటమే మిగులుతుంది. లాజిక్ కు అందని ఈ ఉదంతంలోకి వెళితే.. చిత్తూరు జిల్లా (బైరెడ్డిపల్లె మండలం)కు చెందిన యాభై ఏళ్ల సుబ్రహ్మణ్యం జీవితంలో మిగిలిన వారికి చాలా భిన్నం. చదువు లేని అతడు కూలి పనులకు వెళ్తుంటాడు. రెక్కాడితే కానీ డొక్కాడని సాదాసీదా బడుగు జీవి. అయితే.. ఇతగాడు ఎక్కడకు వెళ్లినా.. ఏ పని చేసినా.. ఏదోలా పాములు అతడ్ని కాటేస్తుంటాయి. ఏదో నాలుగైదు సార్లు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇప్పటికి పదుల సంఖ్యలో పాముకాట్ల బారిన పడ్డాడు.

అంతేనా.. ఈ పాముల దెబ్బకు ఊరు విడిచి బెంగళూరుకు వలస వెళ్లాడు. అక్కడ కూడా పాములు అతడ్ని వదల్లేదు. ప్రతిసారీ పగబట్టినట్లుగా పాములు అతడ్ని కరవటం.. ఆ వెంటనే ఆసుపత్రికి వెళ్లటం.. చికిత్స చేసుకొని బతుకు జీవుడా అని ఇంటికి రావటం రివాజుగా మారింది. ఇతడి దయనీయ పరిస్థితిని చూసినోళ్లు.. సర్పదోష నివారణ.. రాహు కేతు పూజలు.. పరిహారాలు చేయించారు.

అయినా.. అతడి పరిస్థితుల్లో మార్పు లేదు. అతడికి 20 ఏళ్ల వయసులో తొలిసారి పాము కరిచింది. కట్ చేస్తే.. అప్పటి నుంచి ఈ ముప్ఫై ఏళ్లలో పదుల సంఖ్యలో పాములు కాటు వేస్తున్న దుస్థితి. పాముల భయంతో ఊరు వదిలి బెంగళూరు వెళ్లి.. అక్కడ భవన నిర్మాణ.. మట్టి పనుల్లో చేరాడు. అక్కడా పాములు వదల్లేదు. దీంతో చికిత్స చేయించుకొని మళ్లీ ఊరికి వచ్చాడు. స్థానికంగా ఉన్న కోళ్ల పరిశ్రమలో పనికి కుదిరాడు.

అప్పుడప్పుడు పొలం పనులకూ వెళుతుంటాడు. తాజాగా రెండు రోజుల క్రితం ఊరి సమీపంలో పనులు చేస్తుండగా.. మరోసారి పాము కరిచింది. దీంతో.. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తరచూ కరుస్తున్న పాముల కారణంగా అతడి ఆర్థిక పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఏం చేయాలో పాలుపోవట్లేదని.. ఎక్కడే సుబ్రహ్మణ్యం అని వెతికి మరీ పాములు కరుస్తున్నాయని వాపోతున్నాడు. అతడి ఉదంతం గురించి తెలిసినోళ్లంతా అయ్యో అనకుండా ఉండలేని పరిస్థితి. పాపం.. సుబ్రహ్మణ్యం కదూ?

Tags:    

Similar News