మహారాష్ట్ర వదలని ఔరంగజేబు.. తాజా లొల్లి ఏమంటే?
చావా చిత్రం కారణంగా ఔరంగజేబు వర్తమాన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.;
కొద్దిరోజులుగా మహారాష్ట్రలో నడుస్తున్న రాజకీయం మొత్తం ఔరంగజేబు చుట్టూ తిరుగుతోంది. మరాఠాల మీద అధిపత్యం కోసం ఔరంగజేబు ప్రయత్నించటం.. అందులో భాగంగా శివాజీ మహారాజ్.. ఆయన కొడుకు శంభాజీ మహారాజ్ ను హతమార్చినప్పటికీ.. ఆయన కలలు కన్న మరాఠా నేల మాత్రం పాదాక్రాంతం కాకపోవటం.. చివరకు శంభాజీ మహారాజ్ సతీమణి చేసిన శపధానికి తగ్గట్లే.. మరాఠా పొలిమేరలు దాటకుండానే ఔరంగజేబు చనిపోయిన ఉదంతం తెలిసిందే.
అప్పుడెప్పుడో వందల ఏళ్ల క్రితం జరిగిన చరిత్రను బాలీవుడ్ సంచలన మూవీ ‘చావా’ చిత్రం కారణంగా చరిత్ర కాస్తా వర్తమానంలో వచ్చి కూర్చుంది. సహజంగానే భావోద్వేగ చిత్రం కావటం.. మరాఠాయేతర ప్రాంతాల్లోనే తీవ్రమైన భావోద్వేగాన్ని రగిల్చిన ఆ మూవీ.. మహారాష్ట్రలో ఎలాంటి భావావేశాలకు గురి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చావా చిత్రం కారణంగా ఔరంగజేబు వర్తమాన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అతడి పాలన మీద మొదలైన వ్యాఖ్యలు.. పలు రాజకీయ పరిణామాలకు వేదికగా మారాయి. కొత్త ఉద్రిక్తతలకు తెర తీశాయి. చివరకు అవెక్కడి వరకు తీసుకెళ్లాయంటే..ఆ రాష్ట్రంలోని ఔరంగజేబు సమాధి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసే వరకు. దీంతో గతంలో మాదిరి అందరిని అనుమతించటం కూడా నిలిపేశారు. సమాధిని సందర్శించాలని భావించే వారు ముందుగా రిజిస్టర్ లో తమ వ్యక్తిగత వివరాల్ని.. ఆధార్ కార్డుల్ని చూపించిన తర్వాతే అనుమతిస్తున్న పరిస్థితి.
మరాఠాల్లో తీవ్రమైన భావోద్వేగాన్ని రగిలించిన చావా మూవీతో.. ఔరంగజేబు పాలనపై మొదలైన చర్చ.. రాజకీయ వేడిని రగిలించింది. ఇప్పటి వేసవికి మించిన మంటల నేపథ్యంలో.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి.. బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ను ఔరంగజేబుతో పోలుస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కమలనాథులు కోపంతో ఉన్నారు. ఒక క్రూరమైన రాజు.. అందునా ముస్లిం మహారాజును తమ నాయకుడిగా అభివర్ణించటాన్ని సీరియస్ గా తీసుకున్నారు.
బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్దన్ సప్కాల్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఔరంగజేబు ఒక క్రూరమైన పాలకుడిగా పేర్కొంటూ.. ఫడ్నవీస్ కూడా ఔరంగజేబుకు ఉన్న లక్షణాలు ఉన్నాయని.. ఆయన ఎప్పుడూ మతపరమైన అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారే తప్పించి.. రాష్ట్రానికి ఏమీ చేయటం లేదని మండిపడుతున్నారు. రాష్ట్రంలో హత్యకు గురైన సర్పంచ్ సంతోష్ దేశ్ ముఖ్ తరహా అంశాలకే ఆయన ప్రాధాన్యతను ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.
అందుకు ఆయన్ను ఔరంగజేబుతో పోలిస్తే తప్పేంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. పబ్లిక్ లో ఏది మాట్లాడితే అది మాట్లాడతానంటే కుదరదని.. ముఖ్యమంత్రి అద్భుతంగా పాలిస్తుంటే.. ఆయన్ను ఔరంగజేబుతో పోలుస్తారా? అంటూ మండిపడుతున్నారు. సప్కాల్ వ్యాఖ్యలు మహారాష్ట్రకే అవమానమని.. ఆయనపై కేసు నమోదు చేయాలని.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సప్కాల్ మీద తీసుకునే చర్యలు వేరే వారికి గుణపాఠంగా మారాలని కోరుతున్నారు. మొత్తంగా ఔరంగజేబు మహారాష్ట్ర రాజకీయాల్ని నేటికి ప్రభావితం చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.