చంద్రబాబు ఒంటరేనా.. శిష్యుడు కూడా ఎదురుతిరుగుతున్నాడా?

దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటరి అవుతున్నారా? అనే చర్చ మొదలైంది. దక్షిణాదిలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లో ఏపీ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలను ఇండి కూటమి పార్టీలే పాలిస్తున్నాయి.;

Update: 2025-03-01 12:30 GMT

దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటరి అవుతున్నారా? అనే చర్చ మొదలైంది. దక్షిణాదిలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లో ఏపీ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలను ఇండి కూటమి పార్టీలే పాలిస్తున్నాయి. అయితే, త్వరలో జరిగే లోక్ సభ స్థానాల డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న ప్రక్రియ యథా ప్రకారం అమలు అయితే ఏపీ కూడా లోక్ సభ స్థానాలను కోల్పోవాల్సివస్తోంది. జనభా నియంత్రణ పాటించిన దక్షిణాదిలో భారీగా సీట్లు తగ్గి ఆ మేరకు ఉత్తరాదికి పార్లమెంటు సీట్లు పెరుగుతాయంటున్నారు.

దీనివల్ల దక్షిణాదికి రాజకీయంగా ప్రాధాన్యం తగ్గిపోతుందనే ఆందోళన పెరుగుతోంది. దీంతో దక్షిణాది రాష్ట్రాలు కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు సంఘటితమవుతున్నాయి. ఐదు దక్షిణాది రాష్ట్రాలకు నాలుగు రాష్ట్రాల సీఎంలు చేతులు కలిపేలా అడుగులు వేస్తుండగా, ఈ కూటమికి దూరంగా ఒంటరిగా ఏపీ సీఎం చంద్రబాబు మిగిలిపోనున్నారని అంటున్నారు.

భౌగోళికంగా ఏపీ దక్షిణాది రాష్ట్రాల్లో చాలా కీలకంగా ఉంది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో సరిహద్దులు పంచుకుంటున్న ఏపీలో పాలక పార్టీ రాజకీయంగా మిగిలిన రాష్ట్రాలతో సత్సంబంధాలనే కొనసాగిస్తోంది. అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఆ బంధాలు ప్రభావితమవుతాయా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా లోక్ సభ స్థానాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయంగా సీట్లు తగ్గిపోతాయనే ఆవేదన రోజు రోజుకు పెరిగిపోతోంది. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు ఈ విషయమై ఇప్పటికే తమ ఆందోళనను వ్యక్తం చేశారు. దక్షిణాదికి ప్రాధాన్యం తగ్గించేలా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.

అదే జరిగితే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంతకుముందు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఈ విధంగానే ప్రకటనలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా పార్లమెంట్ స్థానాల డీలిమిటేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల తమిళనాడులో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల ఆందోళన అనవసరమని సర్ది చెప్పేప్రయత్నం చేశారు. ఇదేసమయంలో అమిత్ షా వ్యాఖ్యలను కోట్ చేస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలంటూ సిద్ధూ పిలుపునిచ్చారు.

దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో తమిళనాడులో డీఎంకే, కేరళలో సీపీఎం, కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ పాలిస్తున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలు ఇండి కూటమి పార్టీలే. ఇక మిగిలిన రాష్ట్రం ఏపీలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ప్రస్తుత విధానంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో కూడా ఐదు నుంచి ఆరు స్థానాలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఏపీలోని కూటమి కూడా భాగస్వామ్యం కావడంతో సీఎం చంద్రబాబ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కానీ పెదవి విప్పలేకపోతున్నారు.

దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటరి వారు అవుతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్షిణాదిలో గుర్తింపు ఉంది. ఆయన సీఎంగా ఉంటూనే సమర్థంగా జనాభా నియంత్రణ విధానాలు పాటించారు. అవి సత్ఫలితాలు ఇచ్చాయని చెబుతుంటారు. అయితే అదే చంద్రబాబు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని జనాభా నియంత్రణకు ఫుల్ స్టాప్ పెట్టి.. కొత్తగా జననాలు పెరిగేలా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు.

తన జనాభా నియంత్రణ పాలసీని పునఃసమీక్షించుకున్న చంద్రబాబు.. డీలిమిటేషన్ లో దక్షిణాదికి జరగబోయే అన్యాయంపై మాట్లాడటం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం కేంద్రంపై పోరు బాటకు సిద్ధమవడం విశేషంగా భావిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో సీఎంగా పనిచేస్తున్నవారిలో అత్యంత సీనియర్ చంద్రబాబే.. ఆయనే మెతకగా ఉండటంపై ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.

గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా, ప్రస్తుతం ఎన్డీఏలో కీలక నేతగా చంద్రబాబు వ్యవహరించడానికి కారణం ఆయన పార్టీకి వచ్చిన పార్లమెంట్ సీట్లేనంటూ చాలా మంది గుర్తు చేస్తున్నారు. ఇక సీట్లు తగ్గిపోతే భవిష్యత్ రాజకీయాల్లో కేంద్రంలో దక్షిణాది పాత్ర నామమాత్రమయ్యే పరిస్థితులు నెలకొనడంపై చంద్రబాబు మౌనంగా ఉండటం చర్చకు తావిస్తోంది. అదేసమయంలో డీలిమిటేషన్ ప్రక్రియకు జనాభా ప్రాతిపదిక కాకుండా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే సామర్థ్యమూ చంద్రబాబు ఒక్కరికే ఉందంటున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మిగతా దక్షిణాది రాష్ట్రాలు తనను అనుసరించేలా చేస్తారా? లేక మౌనంగా ఉండిపోయి ఒంటరిగా మిగిలిపోతారా? చూడాల్సివుందని అంటున్నారు.

Tags:    

Similar News