ఇక‌.. గౌర‌వ స‌భే..చంద్ర‌బాబు ఏం చేశారంటే!

దీనికి ముందు ఆయ‌న స‌చివాల‌య అధికారుల‌కు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు.

Update: 2024-06-21 07:55 GMT

కౌర‌వ స‌భ‌లో తాను ఉండ‌బోన‌ని.. గౌర‌వ స‌భ ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ముఖ్య‌మంత్రిగానే స‌భ‌లో అడుగు పెడ తాన‌ని శ‌ప‌థం చేసిన టీడీపీ అధినేత‌, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. అలానే చేశారు. ప్ర‌జ‌లు ఇచ్చిన భారీ విజ‌యంతో ఆయ‌న సంతోషంగా స‌భ‌లోకి అడుగు పెట్టారు. ముందుగా స‌భ‌లోకి వ‌స్తూ.. అసెంబ్లీ గ‌డ‌ప‌కు ప్ర‌ణ‌మిల్లారు. అనంత‌రం స‌భ‌లోకి ప్ర‌వేశించారు. దీనికి ముందు ఆయ‌న స‌చివాల‌య అధికారుల‌కు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు.

ప్ర‌తిప‌క్ష హోదా లేక‌పోయినా.. జ‌గ‌న్‌ను వైసీపీ స‌భ్యుల‌ను కూడా ప్ర‌ధాన ద్వారం గుండానే లోప‌లికి అను మ‌తించాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ముఖ్యంగా జ‌గ‌న్ కాన్వాయ్‌ను కూడా.. స‌భ పార్కింగ్ ప్రాంగ‌ణం లోకి అనుమతించాల‌ని.. చంద్ర‌బాబు తెలిపారు. ఆయ‌న‌కు తొలి వ‌రుస‌లోనే సీటును కేటాయించాల‌ని సూచించారు. ఎక్క‌డా గౌర‌వానికి భంగం క‌ల‌గ‌రాద‌ని కూడా.. చంద్ర‌బాబు ఆదేశించారు. అదేవిధంగా ప్ర‌మాణ‌స్వీకార స‌మ‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు.

చంద్ర‌బాబు, పవ‌న్ క‌ళ్యాణ్‌లు ప్ర‌మాణం చేసిన త‌ర్వాత‌.. ఆ వెంట‌నే జ‌గ‌న్ ప్ర‌మాణం చేసేలా చూడాల‌ని స‌చివాల‌య సిబ్బందికి సూచించారు. వాస్త‌వానికిపేరులోనిమొద‌టి అక్ష‌రాన్ని బ‌ట్టి ప్ర‌మాణం చేసేందుకు పిలుస్తారు. కానీ, చంద్ర‌బాబు ఆదేశాల‌తో జ‌గ‌న్‌ను మూడో నెంబ‌రులో చేర్చారు. అయితే.. అప్ప‌టికి ఆయ‌న స‌భ‌కు చేరుకోక‌పోవ‌డంతో ఐదో వ్య‌క్తిగా జ‌గ‌న్‌ను పిలిచారు.

స‌భ‌లోకి జ‌గ‌న్ వ‌చ్చిన‌ప్పుడు కూడా.. అధికార ప‌క్ష స‌భ్యులు పూర్తి సైలెంట్‌గా ఉన్నారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో మాత్రం చంద్ర‌బాబు స‌భ‌లోకి వ‌చ్చినప్పుడు వైసీపీ స‌భ్యులు గేలి చేసిన విష‌యం తెలిసిందే. దీనికి విరుద్ధంగా చంద్ర‌బాబు ఆదేశాలు ఉండ‌డంతో ఇక‌, గౌర‌వ స‌భే ఏర్ప‌డింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

Tags:    

Similar News