కమ్యూనిస్టులు జెండాలు పీకేశారా.. ?
ఇప్పుడు ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. ఎక్కడా కమ్యూనిస్టులు కనిపించడం లేదు.
ఇప్పుడు ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. ఎక్కడా కమ్యూనిస్టులు కనిపించడం లేదు. వారి గళమూ వినిపించడం లేదు. ఒకప్పుడు ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా.. మేమున్నామంటూ.. ఎర్ర జెండాలతో వాలిపోయేవారు కమ్యూనిస్టులు. ఉద్యమాలు.. ధర్నాలు.. అంటూ పెద్ద ఎత్తున ఉద్యమించే వారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ కొంత మేరకు కదలిక వచ్చి.. మార్పుల దిశగా అడుగులు వేసేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
రాష్ట్రంలో కూరగాయల ధరలు పెరిగిపోయాయి. నిత్యావసరాల వస్తువుల ధరలు మండిపోతున్నాయి. సాధారణ ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందిస్తున్నా.. ఆశించినంత మేరకు అయి తే.. పనులు జరగడం లేదు. ప్రధానంగాపేదలు అయితే.. నిజంగానే ఒక పూట తింటే రెండో పూట పస్తు ఉండే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో కమ్యూనిస్టులు స్పందిస్తారని అందరూ ఆశిస్తారు. తద్వారా దళారులకు ఒకింత భయం ఉండి.. ధరలు దిగివచ్చేందుకు అవకాశం ఉంటుంది.
కానీ, కమ్యూనిస్టు కామ్రెడ్‌లు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఇక, గత వారంలో ఏకంగా ఆరుగురు చిన్నా రులపై అఘాయిత్యాలు జరిగాయి. అభంశుభం ఎరుగని చిన్న పిల్లలపై దాడులు, దారుణాలు చోటు చేసుకున్నాయి. అయినా.. ఎర్ర జెండా ఎక్కడా కనిపించలేదు. కమ్యూనిస్టులు వచ్చి ఉద్యమాలు చేసినంత మాత్రాన.. బాధితులకు ఒనగూరే ప్రత్యేక లబ్ధి అంటూ ఏమీ లేకపోయి.. రెచ్చిపోయే వారికి ముకుతాడు పడుతుంది. తమకు ఇబ్బందులు తప్పవనే భయం ఉంటుంది.
కానీ, కమ్యూనిస్టులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు ఉన్న జోక్యం.. స్పీడు.. ప్రజల సమస్యలపై గళం విప్పాలన్న స్పృహను కూడా కామ్రెడ్స్ మరిచిపోయారా? అనే సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. నిజానికి ఈ దేశంలో ఓటు బ్యాంకుతో సంబంధం లేకుండా.. రాజకీయాలు చేయడం.. ప్రజా సమస్యలపై స్పందించడంలోనూ కమ్యూనిస్టులు ఒకప్పుడు ముందున్నారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత.. వారు పడకేశారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. దీనిని బట్టి ఏపీలో కమ్యూనిస్టులు జెండా పీకేసినట్టేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.