ఏంటి 'కామ్రెడ్'.. పనిలేదా.. పింఛన్‌కు అప్లయ్ చేసుకో ..!
ప్రస్తుతం ఏపీలోనేకాదు.. తెలంగాణలోనూ కామ్రెడ్స్‌కు పనిలేకుండా పోయింది. ఒకప్పుడు.. ఏదైనా సమస్య ఉంటే.. ప్రజలు కమ్యూనిస్టు పార్టీల కార్యాలయాలకు క్యూ కట్టేవారు.
ప్రస్తుతం ఏపీలోనేకాదు.. తెలంగాణలోనూ కామ్రెడ్స్‌కు పనిలేకుండా పోయింది. ఒకప్పుడు.. ఏదైనా సమస్య ఉంటే.. ప్రజలు కమ్యూనిస్టు పార్టీల కార్యాలయాలకు క్యూ కట్టేవారు. అక్కడే ఫారాలు ఫిలప్ చేసి..వారికి ఇచ్చేవారు. దీంతో కమ్యూనిస్టులు ఉద్యమాలు.. నిరసనలు.. ఆందోళనలు.. అంటూ నల్లటి రోడ్లను ఎర్రబరిచేవారు. జెండాలు కట్టి.. జనాలను పోగేసేవారు. కానీ... ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పనిని ప్రభుత్వాలే చేస్తున్నాయి.
నేరుగా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. వాటిని అప్పటి కప్పుడు పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. లేకపోతే.. కొంత సమయం పెట్టుకుని పరిష్కరిస్తున్నారు. ఇలా.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ప్రతిపక్షాలను, ముఖ్యంగా ఉద్యమాల కోసం.. ప్రజా సమస్యల కోసం పుట్టిన కమ్యూనిస్టు లను విస్మరిచారు. దీంతో కామ్రెడ్స్‌కు ఇప్పుడు పనిలేకుండా పోయింది. అందుకే.. అసలు ఎక్కడా ఉద్యమాలు.. రగడలు.. వివాదాలు.. లాఠీ చార్జీలు వంటివి కూడా కనిపించడం లేదు.
దీంతో ఏదో ఒక విషయాన్ని పట్టుకుని మీడియా ముందుకు రావాలనే తాపత్రయం చేస్తున్నారు కామ్రెడ్స్. ఈ క్రమంలో సీపీఎంపరిస్థితి ఎలా ఉన్నా.. సీపీఐ మాత్రం లేనిపోని వివాదాలు నెత్తిన వేసుకుంటోంది. గతంలో సీపీఐ నారాయణ `బిగ్‌బాస్`ను ఇలానేరాజకీయం చేసి.. నెటిజన్లతో తిట్లు తిన్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు.ఇ క, తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా లేనిపోని విషయాన్ని మాట్లాడి.. జనసేన నాయకుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సీపీఐ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు.. ఆ పార్టీలో ఆగ్రహాన్ని పెంచాయి. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు? అని వ్యాఖ్యానించడంపై జనసైనులు నిప్పులు చెరుగుతున్నారు. పవన్ కల్యాణ్ గత నాలుగు రోజులు దక్షిణ భారత యాత్ర చేసి.. ఆలయాలు దర్శించారు. గతంలో సనాతన ధర్మదీక్ష చేశారు. వీటిని విమర్శిస్తూ.. రామకృష్ణ యాగీ చేశారు.
దీనిపై జనసేన నాయకులు ఫైరయ్యారు. ఎంత డిప్యూటీ సీఎం అయినా..ఆయన కూడా మనిషేనని.. సగటు మనిషికి ఉన్నట్టే ఆయనకు కూడా.. సెంటిమెంట్లు, మనోభావాలు ఉంటాయని.. అయినా.. ఇది అధికారిక కార్యక్రమం కాదని.. ప్రజాధనమేమీ దుర్వినియోగం చేయలేదని.. జనసేన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. రామకృష్ణకు పనిలేకపోతే.. పింఛను కోసం అప్లయి చేసుకోవాలని సెటైర్లు వేస్తున్నారు.