క్రిస్ గేల్ పేరు చెప్పి మహిళకు రూ.2.8 కోట్ల టోకరా
సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారుల కథనం ప్రకారం.. 2019లో వ్యాపారవేత్త సోదరుడు, అతని భార్య ఆమెను ఒక ఆకర్షణీయమైన పెట్టుబడి ఉందంటూ సంప్రదించారు.;
ఈ మధ్య ప్రముఖుల పేరు చెప్పి దోపిడీ చేయడం ఒక కొత్త ట్రెండ్ గా మారింది. ఇది ధోని కంపెనీ అని ఒకరు.. ఇది కోహ్లీ కంపెనీ అని మరొకరు ముందుకొచ్చి కోట్ల పెట్టుబడులు సమీకరించి పంగనామాలు పెడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రముఖ వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ పేరుతో మరో భారీ దోపిడీ కథ వెలుగుచూసింది. 60 ఏళ్ల వ్యాపారవేత్త తన సొంత అన్నతో సహా ఆరుగురు వ్యక్తులపై నేరపూరిత ఫిర్యాదు దాఖలు చేశారు. ప్రముఖ వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్‌తో సంబంధం ఉన్నట్లుగా నమ్మబలికి, కాఫీ పొడి తయారీ పెట్టుబడి పథకం పేరుతో 2.8 కోట్ల రూపాయలు మోసం చేశారని ఆమె ఆరోపించారు. అధిక రాబడిని వాగ్దానం చేసిన ఈ మోసం, బాధితురాలిని.. ఇతర పెట్టుబడిదారులను తీవ్ర ఆర్థిక నష్టాలకు గురిచేసింది.
- మోసపూరిత పథకం ఎలా జరిగింది?
సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారుల కథనం ప్రకారం.. 2019లో వ్యాపారవేత్త సోదరుడు, అతని భార్య ఆమెను ఒక ఆకర్షణీయమైన పెట్టుబడి ఉందంటూ సంప్రదించారు. కెన్యాలో ఉన్న కాఫీ పొడి తయారీ సంస్థకు నిధులు సమకూర్చడానికి ఈ డబ్బును ఉపయోగిస్తామని, అది అమెరికాలో కొత్త యూనిట్‌కు విస్తరిస్తోందని వారు నమ్మించారు. ఆమె నమ్మకాన్ని పొందడానికి నిందితులు క్రిస్ గేల్ ఫోటోలు.. వీడియోలను చూపించి, గేల్ వ్యాపారానికి ప్రమోటర్ అని చెప్పారు. "కంపెనీ యజమాని తమకు తెలుసని, నిందితుల్లో ఒకరు కంపెనీలో భాగస్వామిగా ఉంటారని ఆమెకు నిందితులు చెప్పారు. సోదరుడి మాటలను నమ్మిన ఆ లేడీ వ్యాపారవేత్త 2.8 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది. ఆమె తన కుటుంబ సభ్యులు , స్నేహితులను కూడా పెట్టుబడి పెట్టమని ప్రోత్సహించింది. ఫలితంగా మొత్తం 5.7 కోట్ల రూపాయలు ఈ పథకంలో పెట్టుబడి పెట్టారు. కొంతకాలం పాటు, ఈ పథకం చట్టబద్ధమైనదిగా కనిపించింది. బాధితులు మొదట్లో నెలవారీ రాబడిని అందుకున్నారు, ఇది వ్యాపారం వృద్ధి చెందుతోందని వారి నమ్మకాన్ని బలపరిచింది. అయితే చెల్లింపులు త్వరలోనే ఆగిపోయాయి. ఇది పెట్టుబడిదారులలో ఆందోళనను రేకెత్తించింది. ఈ సమస్య గురించి వ్యాపారవేత్త తన సోదరుడిని ప్రశ్నించినప్పుడు, వారి పిల్లలు కంపెనీ అమెరికా యూనిట్ పనిచేస్తోందని కొద్దిరోజులు ఓపిక పట్టాలని ఆమెకు భరోసా ఇచ్చాడు. ఆమె అభ్యర్థనలు చేసినప్పటికీ, నిందితులు పెట్టుబడిదారుల ప్రశ్నలను దాటవేస్తూనే ఉన్నారు. మహిళ తన సోదరుడిని మరింత సమాచారం కోసం ఒత్తిడి చేసినప్పుడు... అతను ఆమెను దుర్భాషలాడాడు.
మొత్తంగా బాధితులు 5.7 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కానీ వారికి 90 లక్షల రూపాయలు మాత్రమే రాబడి వచ్చింది. వాగ్దానం చేసిన అధిక రాబడి రాక మోసపోయారు. ఈ అమాయక పెట్టుబడిదారులను ఆకర్షించే ఒక వ్యూహం మాత్రమేనని మోసం చేశారని తర్వాత బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ప్రస్తుతం తీవ్ర మనోవేదనకు గురైన లేడి వ్యాపారవేత్త, తన సోదరుడితో సహా ఈ మోసంలో పాల్గొన్న ఆరుగురు వ్యక్తులపై నేరపూరిత ఫిర్యాదు దాఖలు చేసింది.
దీంతో పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం, విశ్వసనీయ వ్యక్తుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం అని పోలీసులు సూచిస్తున్నారు.