మహా సీఎం ఎవరో ఖరారు.. రేపే ప్రమాణ స్వీకారం

ఇందులో ఫడణవీస్‌ పేరును ప్రతిపాదించగా దానికి ఏకగ్రీవ ఆమోదం దక్కింది. గురువారం ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమైంది.

Update: 2024-12-04 06:59 GMT

ఎన్నికల ఫలితాలు వచ్చిన పది రోజులకు ఎట్టకేలకు మహారాష్ట్ర సీఎం ఎవరో ఖరారైంది.. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా పని చేసిన అజిత్ పవార్ ఏ మెలిక పెట్టకున్నా.. ఇప్పటివరకు ఆపధర్మ సీఎంగా పనిచేసిన ఏక్ నాథ్ శిందే పట్టు మీద ఉండడంతో ఇంత ఆలస్యమైంది. అసెంబ్లీ గడువు గత నెల 26తోనే ముగిసినా ప్రతిష్ఠంభన వీడకపోవడంతో కొత్త ముఖ్యమంత్రి ఎప్పుడా? అనే ఉత్కంఠ, అసహనం పెరిగిపోయాయి. దీంతో ఓ దశలో బీజేపీ –శివసేన-ఎన్సీపీ కూటమి ఒక్కటిగానే ఉంటుందా? అనే సందేహాలూ వ్యక్తం అయ్యాయి. చివరకు అవన్నీ సుఖాంతమయ్యాయి.

ప్రతిష్ఠంభనకు తెర మహా ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది. ఎట్టకేలకు ప్రతిష్ఠంభనకు తెరపడింది. ఇప్పటికే ఓసారి (2014-19) మధ్య సీఎంగా పనిచేసిన నాగపూర్ నాయకుడు, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడణవీస్‌ పేరు మహారాష్ట్ర తదుపరి సీఎంగా ఖరారైంది. మహారాష్ట్ర అంటే మామూలు మాటలు కాదు. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్న రాష్ట్రం. రాజకీయంగానూ ఎంతో కీలకమైనది. ఫడణవీస్ ను సీఎం చేయనుండడం ద్వారా అలాంటి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు దగ్గరదగ్గరగా సీట్లు తెచ్చుకున్న బీజేపీ సీఎం పదవినీ తమకే దక్కించుకున్నట్లయింది.

కూటమిలో బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఇందులో ఫడణవీస్‌ పేరును ప్రతిపాదించగా దానికి ఏకగ్రీవ ఆమోదం దక్కింది. గురువారం ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమైంది. కోర్‌ కమిటీ సమావేశం అనంతరం ముంబై విధాన్‌ భవన్‌లో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. దీనికి పార్టీ తరఫున పరిశీలకులుగా వచ్చిన నిర్మలా సీతారామన్‌, విజయ్‌ రూపానీ హాజరయ్యారు. సీఎం ఎంపికపై ఎమ్మెల్యేలతో చర్చించారు. అనంతరం పార్టీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడణవీస్‌ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రమాణం ఎక్కడ..? మోదీ హాజరు

ముంబై ఆజాద్‌ మైదానంలో ఫడణవీస్ గురువారం ప్రమాణం చేయనున్నారు. దీనికి ప్రధాని మోదీ సహా ఎన్డీయే కీలక నేతలు పాల్గొంటారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆపధర్మ సీఎంగా ఉన్న ఏక్‌నాథ్‌ శిందే, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌ లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేస్తారని తెలుస్తున్నా.. ఖరారు కాలేదు.

Tags:    

Similar News