విజయవాడలో 'డ్రోన్ షో'.. ఓ రేంజ్‌లో మురిసిపోయిన చంద్రబాబు!
డ్రోన్ షో సందర్భంగా కళాకారులు చేసిన విన్యాసాలనుచూసి..చంద్రబాబు మురిసిపోయారు.
నిత్యం పరిపాలనా పనులు, అధికారులకు సూచనలు, పలు అంశాలపై సమీక్షలతో బిజీబిజీగా గడిపేసే సీఎం చంద్రబాబు మంగళవారం రాత్రి విజయవాడలోని భవానీ పురం సమీపంలో ఉన్న పున్నమి ఘాట్‌లో నిర్వహించిన `డ్రోన్ షో`లో అత్యంత సంబరంగా గడిపారు. గతంలో ఎవరూ ఎప్పుడూ చూడని విధంగా ఆయన ముఖంలో సంతోషం..సంబరం రెండూ కొట్టొచ్చినట్టు కనిపించాయి. డ్రోన్ షో సందర్భంగా కళాకారులు చేసిన విన్యాసాలనుచూసి..చంద్రబాబు మురిసిపోయారు.
మంగళవారం నుంచి బుధవారం వరకు రెండు రోజులపాటు జరిగే ‘డ్రోన్ షో’ విజయవాడలోని పున్నమి ఘాట్లో ప్రారంభం అయింది. సీఎం చంద్రబాబు పున్నమి ఘాట్ కు చేరుకుని ఆసాంతం కార్యక్రమాన్ని వీక్షించారు.. కృష్ణా నది తీరంలో 5500 డ్రోన్లతో షో నిర్వహించారు. దీనిని వీక్షించేందుకు భారీగా సందర్శకులు తలివచ్చారు. సందర్శకుల కోసం 5 పెద్ద తెరలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్రానికి చెందిన ఇతర మంత్రులు హజరయ్యారు.
అయితే.. తొలుత డ్రోన్ షోకు ముందు.. నిర్వహించిన కళాకారుల ప్రదర్శనను చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. డమ్ములు, సైకిల్‌తో చేసిన విన్యాసం సందర్భంగా చంద్రబాబు కేరింతలే కొట్టారని చెప్పాలి. ముఖంలో చిరువునవ్వు చెదరలేదు. పక్కనే ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌ను కూడా.. ఆయన పదే పదే `చూడు-చూడు` అంటూ ప్రోత్సహించారు. ఒకానొక దశలో సైకిల్‌పై చేసిన విన్యాసాలు చూసిన చంద్రబాబు తన సంతోషాన్ని చప్పట్లరూపంలో ప్రకటించారు. ప్రస్తుతం ఈ డ్రోన్ షోకు సంబంధించిన వీడియోలు, చంద్రబాబు సంబరాలు.. సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. బాబు ఆనందం చూసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మురిసిపోతున్నారు.