హెచ్-1బీ వీసాలపై ఎలాన్ మస్క్ తగ్గేదేలే... స్ట్రాంగ్ రియాక్షన్!
అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించే హెచ్-1బీ వీసా వ్యవహారం పై ఆ దేశంలో రగడ కొనసాగుతోందనే చెప్పాలి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి.. త్వరలో వైట్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఓ విషయం కత్తిమీద సాములా మారుతుందా అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. అదే హెచ్-1బీ వీసా వ్యవహారం. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా తన అభిప్రాయానికి, నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని అంటున్నారు.
అవును.. అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించే హెచ్-1బీ వీసా వ్యవహారం పై ఆ దేశంలో రగడ కొనసాగుతోందనే చెప్పాలి. ఈ వీసాకు ఎలాన్ మస్క్ మద్దతుగా నిలుస్తుండగా.. ఇటీవల ట్రంప్ కూడా ఈ వీసాలపై సానుకూలత వ్యక్తం చేస్తూ స్పందించారు. అయితే... ట్రంప్ మద్దతుదారులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ప్రధానంగా ఎన్నికల సమయంలో ట్రంప్ చేసిన 'అమెరికా ఫస్ట్' నినాదానికి ఇది వ్యతిరేకం అనే కామెంట్లు ఆయన మద్దతుదారుల నుంచి వినిపిస్తున్నాయి. అమెరికన్లో నిరుద్యోగాన్ని పెంచడానికి సహకరించే ఈ వీసా విషయంలో పునరాలోచించాలని ట్రంప్ మద్దతుదారులు పట్టుబడుతున్నారు. ఈ సమయంలో తనపై వస్తోన్న విమర్శలపై మస్క్ ఘాటుగా స్పందించారు.
ఇటీవల హెచ్-1బీ వీసాలకు మద్దతుగా మస్క్ చేసిన వ్యాఖ్యను ప్రస్థావిస్తు... స్టీవెన్ మాకీ అనే అమెరికన్ కంపోజర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... వ్యర్థమైన వాటిని మెరుగుపరిచేందుకు ప్రయత్నించొద్దని మస్క్ గతంలో అన్న వ్యాఖ్యలను ప్రస్థావించారు.. అలాంటి మస్క్ ఇప్పుడు హెచ్-1బీ వీసా విధానంలో సంస్కరణలకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు!
దీంతో.. మస్క్ ఒక్కసారిగా ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అయినట్లుగా మండిపడ్డారని అంటున్నారు. ఈ కామెంట్లపై స్పందించిన మస్క్... తాను స్పేస్ ఎక్స్, టెస్లాను ఏర్పాటు చేశానని.. ఇలాంటి అనేక సంస్థలను ఎందరో అమెరికాకు వలసవచ్చి ఏర్పాటు చేశారని.. ఇవన్నీ అమెరికాను శక్తివంతం చేశాయని.. తనతో పాటు వారందరూ అమెరికాకు రాగలిగారంటే అందుకు కారణం హెచ్-1బీ వీసా అని తెలిపారు.
అనంతరం.. తనపై కామెంట్ చేసిన స్టీవెన్ మాకీని ఉద్దేశించి.. "నువ్వు కాస్త తగ్గు.. నీలాంటి వాళ్లు దీన్ని అస్సలు అర్ధం చేసుకోలేరు.. ఈ వీసా విషయంలో నేను యుద్ధానికైనా సిద్ధమే" అంటూ ఫైర్ అయ్యారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్! దీంతో... ఈ హెచ్-1బీ వీసాలా విషయంలో మస్క్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో అర్ధమవుతుందని అంటున్నారు పరిశీలకులు.