'నా కొడుకు ని బయటకు పొమ్మని చెప్పాలి'... మస్క్ తండ్రి సంచలన వ్యాఖ్యలు!

ఎలాన్ మస్క్ కు, ఆయన తండ్రి ఎర్రల్ మస్క్ కు మధ్య తీవ్రమైన అభిప్రాయభేధాలున్నాయనే సంగతి తెలిసిందే.

Update: 2025-01-08 10:30 GMT

ఎలాన్ మస్క్ కు, ఆయన తండ్రి ఎర్రల్ మస్క్ కు మధ్య తీవ్రమైన అభిప్రాయభేధాలున్నాయనే సంగతి తెలిసిందే. గతంలో విడుదలైన ఎలాన్ మస్క్ జీవిత చరిత్ర బుక్ రచయిత ఐజాక్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అప్పట్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో తాజాగా తన కుమారుడు ఎలాన్ మస్క్ పై ఎర్రల్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇతర దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ పలు విమర్శలు వెళ్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... మస్క్ పై ప్రధానంగా బ్రిటన్, ఫ్రాన్స్ అధ్యక్షులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇతర దేశ రాజకీయాల్లో మస్క్ జోక్యంపై అతని తండ్రి ఎరోల్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఎలాన్ మస్క్ చెప్పేది వినాల్సిన అవసరం ప్రజలకు లేదని.. అతడూ తన ఉద్దేశ్యంలో ఓ మామూలు మనిషని.. అతని వద్ద డబ్బుంది, పెద్ద బిలియనీర్ కాబట్టి అతడు చెప్పేవి చాలా మంది రీట్వీట్ చేస్తుంటారని ఎర్రోల్ మస్క్ అన్నారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇతర దేశాల రాజకీయాల్లో ఎలాన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ చెప్పే వాటిని పట్టించుకోవద్దని.. వాటి గురించి ఏమాత్రం చితించకుండా.. అతడిని బయటకు పొమ్మని చెప్పాలని ఎర్రో పేర్కొన్నారు. దీంతో... ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

కాగా... అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు వరకూ కేవలం వ్యాపార సంబంధ విషయాల్లోనే హాట్ టాపిక్ గా మారిన ఎలాన్ మస్క్... ట్రంప్ విజయం అనంతరం అమెరికా రాజకీయాలపైనే కాకుండా పలు ప్రపంచ దేశాల రాజకీయాలపైనా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా... ఇటీవల బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పై సంచలన ఆరోపణలు చేశారు.

యూకేలోని గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాలపై మస్క్ ఇటీవల వరుసగా ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. వాటిని అదుపు చేయడంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదాలో ఉన్నవేళ స్టార్మర్ విఫలమయ్యారని విమర్శించారు. ఈ ఆరోపణలను స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. మస్క్ పేరు ప్రస్థావించకుండా.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నారు.

ఇదే సమయంలో... ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా ఇటీవల ఎలాన్ మస్క్ పై ఆరోపణలు గుప్పించారు. ఇందులో భాగంగా... తమ దేశ ఎన్నికల్లో మస్క్ జోక్యం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. ప్రగతిశీల సంస్కరణలను మస్క్ వ్యతిరేకిస్తున్నారని.. ప్రపంచ వ్యాప్తంగా అధికార మార్పిడి ఉద్యమానికి మస్క్ మద్దతిస్తున్నారని మండిపడ్డారు.

ఇదే క్రమంలో... ఇటీవల నార్వే ప్రధాని జోనాస్ కూడా ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఎలాన్ మస్క్ అమెరికా వెలుపల ఆయా దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని జోనాస్ అన్నారు. తన సోషల్ మీడియా నెట్ వర్క్ ని విస్తృతంగా వినియోగించుకునే సౌలభ్యం మస్క్ కు ఉందని తెలిపారు.

పైగా మస్క్ దగ్గర భారీ స్థాయిలో ఆర్థిక వనరులు ఉన్నాయని.. అలాంటి వ్యక్తి ఇతర దేశాల రాజకీయాల్లో, అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొవడం ఏమాత్రం మంచిది కాదని చెబుతూ.. జోనాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశ రాజకీయాల్లో మస్క్ జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటే.. అన్ని పక్షాల నాయకులు కలిసి కట్టుగా ఆయన ప్రయత్నాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News