దౌత్య విజయం: గూఢచర్యం ఎపిసోడ్ లో 8 మందిని రిలీజ్ చేసిన ఖతార్
ఎనిమిది మందిలో ఏడుగురు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఖతార్ నిర్ణయాన్ని భారత సర్కారు స్వాగతంచింది
అవును. వావ్.. అనే దౌత్య విజయంగా దీన్ని అభివర్ణించాలి. కఠినచట్టాలకు కేరాఫ్ అయిన ఖతార్ లో మోడీ సర్కారు సాధించిన అద్భుత విజయంగా దీన్ని అభివర్ణించాలి. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయిన 8 మంది భారతీయుల్ని (మాజీ నేవీ ఉద్యోగులు)ను ఖతార్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. 18నెలలుగా వీరు ఖతార్ జైల్లో ఖైదీలుగా ఉన్నారు. వీరికి విధించిన మరణ శిక్షను ఇప్పటికే అక్కడి కోర్టులు జైలుశిక్షగా మార్చగా.. తాజాగా దాని నుంచి విముక్తి కల్పించి భారత్ కు అప్పగించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఎనిమిది మందిలో ఏడుగురు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఖతార్ నిర్ణయాన్ని భారత సర్కారు స్వాగతంచింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ సోమవారం తెల్లవారుజామున ఒక ప్రకటనను విడుదల చేస్తూ.. ‘‘దహ్రా గ్లోబల్ కంపెనీలో పని చేస్తూ ఖతార్ లో అరెస్టుఅయిన ఎనిమిది మంది భారత పౌరులను విడుదల చేయటాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఏడుగురు ఇప్పటికే స్వదేశానికి చేరుకున్నారు. వీరి విడుదలకు వీలుగా ఎమిర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఖతార్ తీసుకున్న నిర్ణయాన్ని మేం అభినందిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
తాజా పరిణామం భారతప్రభుత్వం సాధించిన అద్భుత దౌత్య విజయంగా చెప్పాలి. దీని క్రెడిట్ మొత్తం మోడీ సర్కారుకే చెందుతుంది. గూఢచర్యం ఆరోపణల కిందఎనిమిది మంది భారత నౌకా దళ మాజీ సిబ్బందిని 2022లో ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేవలం రెండు.. మూడుసార్లు మాత్రమే విచారణ జరిపిన ప్రాథమిక కోర్టు వీరికి మరణశిక్షను విధించింది. దీన్ని రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసింది.
ఈ నేపథ్యంలో అప్పీలు చేసుకోవటానికి అక్కడి కోర్టు అనుమతులు జారీ చేసింది. అనంతరం పూర్తి స్థాయి విచారణ అనంతరం న్యాయస్థానం వారికి విధించిన మరణశిక్షను జైలుశిక్షగా మారుస్తూ తీర్పును ఇచ్చారు. ఈ తీర్పు గత ఏడాది (2023) డిసెంబరు 28న వెలువడింది. దీనిపై అప్పీలు చేసుకోవటానికి కూడా 60 రోజులు గడువును ఇచ్చింది. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్ని వినియోగించుకునేలా మన విదేశాంగ శాఖ వారి విడుదలకు విశేషంగా ప్రయత్నాలు చేసింది.
మొత్తానికి విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారు భారత్ కు చేరుకోవటానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. అవేమీ బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంగా దౌత్యపరంగా భారత్ ఘన విజయాన్ని సాధించిందని చెప్పాలి. అయితే.. ఇదంతా కూడా నిరంతర ప్రయత్నాలు.. ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ చొరవతోనే సాధ్యమైందని చెబుతున్నారు. ఈ మాటను చెబుతున్నది ఎవరో కాదు ఢిల్లీకి చేరుకున్న మాజీ నేవీ అధికారులు. ప్రధాని మోడీ వ్యక్తిగత జోక్యం లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదని ఒక అధికారి పేర్కొన్నారు.
ఢిల్లీకి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ నేవీ అధికారి ఒకరు.. 'ప్రధాని మోడీ జోక్యం చేసుకొని ఖతార్ ప్రభుత్వంతో ఉన్నత స్థాయిలో చర్చలు జరపటం వల్లే మేం ఈ రోజు మీ ముందున్నాం. ప్రధానికి.. ఖతార్ ఎమిర్ కు కృతజ్ఞతలు చెప్పటానికి మాకు మాటల్లేవు. వారిద్దరి మధ్య సత్ సంబంధాలే మా విడుదలకు దారి తీశాయి'' అని వెల్లడించారు.
గల్ఫ్ దేశమైన ఖతార్ లో లక్షలాది మంది భారతీయులు ఉన్నారు. వివిధ రంగాల్లో పలువురు పలు సేవలు అందిస్తున్నారు. దోహాకు గణనీయమైన ఎగుమతులు చేసే దేశాల్లో భారత్ ఒకటి. ఉగ్రవాదానికి సాయం చేస్తుందన్న పేరుతో గతంలో సౌదీ.. యూఏఈ.. బహ్రెయిన్.. ఈజిప్టు దేశాలు ఖతార్ కు దారి తీసే జల.. వాయు.. భూమార్గాల్ని కట్టడి చేసిన కష్ట సమయంలో భారత్ వారికి అవసరమైన అన్ని రకాల సాయాన్ని చేసి అండగా నిలిచింది. తాజాగా విడుదలైన ఎనిమిది మందిలో ఒకరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.
విడుదలైన ఎనిమిది మంది ఎవరంటే..
- కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ్
- నవతేజ్ గిల్
- కమాండర్ బీరేంద్ర కుమార్ వర్మ
- కమాండర్ పూర్ణేందు తివారీ
- కమాండర్ సుగుణాకర్ పాకాల
- కమాండర్ సంజీవ్ గుప్తా
- కమాండర్ అమిత్ నాగ్ పాల్
- సెయిలర్ రాగేశ్