ఫ్యాక్ట్ చెక్... రజనీకాంత్ ఇంటిని వరద నీరు ముంచెత్తిందా?
వస్తున్న నివేదికలు అన్నీ అవాస్తవాలని చెబుతూ.. రజనీకాంత్ నివాసం వరద నీటికి ప్రభావితం కాలేదని.. అంతా క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైన నేపథ్యంలో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో... లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో సుమారు 300 ప్రాంతాలు జలమయమైనట్లు చెబుతున్నారు.
లోతట్టు ప్రాంతాలన్నీ మోకాళ్లకుపైగా నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి. పలు విమానాలు, రైళ్లు రద్దు అవ్వగా.. తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఇంటిని కూడా వరద నీరు ముంచెత్తిందని వార్తలు వస్తున్నాయి.
అవును... ప్రస్తుతం చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పోయెస్ గార్డెన్ ప్రాంతంలోని సూపర్ స్టార్ రజనీకాంత్ ఇల్లు జలమయమైందని ఆన్ లైన్ లో పుకార్లు వ్యాపించాయి. అయితే ఈ ప్రచారంపై రజనీకాంత్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్వో) స్పందించారు. ఇందులో భాగంగా ఈ ప్రచారాన్ని ఖండించారు.
వస్తున్న నివేదికలు అన్నీ అవాస్తవాలని చెబుతూ.. రజనీకాంత్ నివాసం వరద నీటికి ప్రభావితం కాలేదని.. అంతా క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసారు. దీంతో.. తమ సూపర్ స్టార్ నివాసం ప్రభావితం కాలేదని అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారని అంటున్నారు.
కాగా... ప్రస్తుతం రజనీకాంత్ "వేట్టయన్" విజయాన్ని ఆస్వాధిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. రూ.240 కోట్లు వసూళ్లు చేసి సూపర్ స్టార్ హిట్ సినిమాల లిస్ట్ లో చేరింది. ఇదే క్రమంలో ప్రస్తుతం రజనీకాంత్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో "కూలి" సినిమాలో నటిస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెత్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ పాటు.. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీని తర్వాత రజనీ "జైలర్ 2" కూడా ఉందని అంటున్నారు.