'ఘిబ్లీ' ట్రెండ్ వెనుక అసలు కథ ఇదే! ఈ కళ పుట్టింది ఎక్కడో తెలిస్తే షాకవుతారు!
అసలు ఘిబ్లీ ఆర్ట్ ఎలా ప్రారంభమైంది? దీన్ని మొదట ఎవరు సృష్టించారు? ఆ వ్యక్తి ఎవరు? దీని చరిత్ర ఏమిటి? వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.;

ప్రస్తుతం మీరు ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ స్క్రోల్ చేస్తున్నప్పుడు చాలా మంది 'ఘిబ్లీ' ట్రెండ్‌ను ఫాలో అవుతూ కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫోటోలను AI ప్లాట్‌ఫామ్ చాట్‌జీపీటీ (ChatGPT) ద్వారా ఘిబ్లీ యానిమేషన్‌గా మార్చి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.. వాట్సాప్ స్టేటస్‌లుగా కూడా పెడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతుండడం విశేషం. అయితే, ఈ ఘిబ్లీ యానిమేషన్ ఇప్పుడే మొదలు కాలేదు.. అసలు ఘిబ్లీ ఆర్ట్ ఎలా ప్రారంభమైంది? దీన్ని మొదట ఎవరు సృష్టించారు? ఆ వ్యక్తి ఎవరు? దీని చరిత్ర ఏమిటి? వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
జపాన్‌తో ఈ కళకు సంబంధం ఉంది
ఘిబ్లీ ఆర్ట్‌కు జపాన్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడి కళాకారుడు హయావో మియాజాకి (Hayao Miyazaki) కొందరు వ్యక్తులతో కలిసి 1985లో స్టూడియో ఘిబ్లీని ప్రారంభించారు. తన కళ ద్వారా ఆయన ఎంతో పేరు సంపాదించారు. నేడు స్టూడియో ఘిబ్లీ యానిమేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద పేరుగా నిలిచింది. ముఖ్యంగా, మియాజాకి ఘిబ్లీ ఆర్ట్ కింద ప్రతి చిత్రాన్ని తన చేతులతోనే సృష్టించారు. ఈరోజు మనం AI ద్వారా ఐదు నిమిషాల్లో తయారుచేస్తున్న చిత్రాన్ని రూపొందించడానికి మియాజాకి ఎన్నో ఏళ్లు కష్టపడ్డారు. ఇప్పుడు ప్రపంచం ఈ కళకు అభిమానిగా మారింది.
కోట్ల రూపాయలు ఆర్జించిన ఘిబ్లీ స్టూడియో
ఘిబ్లీ ఆర్ట్ ద్వారా ఘిబ్లీ స్టూడియో కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ స్టూడియో 25 కంటే ఎక్కువ యానిమేటెడ్ సినిమాలు, టీవీ సిరీస్‌లను రూపొందించింది. నివేదికల ప్రకారం, ఈ స్టూడియో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'స్పిరిటెడ్ అవే', ఇది ప్రపంచవ్యాప్తంగా రూ.2300 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. నేడు ఈ స్టూడియో యానిమేషన్ ప్రపంచంలోని అతిపెద్ద స్టూడియోలలో ఒకటి. కొన్ని మీడియా నివేదికల ప్రకారం స్టూడియో ఘిబ్లీ వ్యవస్థాపకుడు హయావో మియాజాకి నికర విలువ 50 మిలియన్ డాలర్లు (రూ.428 కోట్లు) కంటే ఎక్కువ.